లడక్‎లో కేంద్రానికి వ్యతిరేకంగా యువత ఆందోళన.. CRPF వాహనానికి నిప్పుపెట్టిన నిరసనకారులు

లడక్‎లో కేంద్రానికి వ్యతిరేకంగా యువత ఆందోళన.. CRPF వాహనానికి నిప్పుపెట్టిన నిరసనకారులు

లేహ్: కేంద్ర పాలిత ప్రాంతం లడక్ రాజధాని లేహ్‎లో హైటెన్షన్ నెలకొంది. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేహ్‎లోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి.

 నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన నిరసనకారులు సీఆర్‎పీఎఫ్ వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు, బలగాలు లేహ్‎లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

అయినప్పటికీ వెనక్కి తగ్గని నిరసనకారులు లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, ప్రభుత్వ అవినీతి, రాచరిక పోకడలకు వ్యతిరేకంగా ఇటీవల నేపాల్ లో జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. యువత ఆందోళనల దెబ్బకు నేపాల్ లో ప్రభుత్వ పీఠాలు కదిలాయి. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో లడక్‎లో కూడా విద్యార్థులు, యువత ఆందోళనకు దిగడం గమనార్హం. 

2019 అక్టోబరు 31న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి లడఖ్‌ను వేరు చేసి ఒక స్వతంత్ర కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే లడక్‎కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు,  యువత ఆందోళనకు దిగారు.