ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొత్తేమీ కాదు

ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొత్తేమీ కాదు
  • ప్రభుత్వానికి సహకరిస్తమని వెల్లడి
  • వెల్​లోకి రాబోమనే హామీ ఇస్తే సరేనన్న మంత్రి జోషి
  • అన్ని అంశాలపైనా చర్చకు సిద్దమని ప్రకటన

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ సభ్యులపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తేయాలని లోక్​సభలో ప్రతిపక్షాలు బుధవారం డిమాండ్​ చేశాయి. సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని వెల్లడించాయి. కాంగ్రెస్​ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను తిరిగి సభలోకి అనుమతించాలని కోరాయి. నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్సీపీ), తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ), ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎంపీలు ఈ డిమాండ్​ చేశారు. ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొత్తేమీ కాదని, ప్లకార్డులు గతంలోనూ ప్రదర్శించారని గుర్తుచేశారు. అయితే, మరోసారి వెల్​లోకి వెళ్లబోమని, సభలో ప్లకార్డులు తీసుకురాబోమని హామీ ఇస్తే స్పీకర్​ అనుమతితో ఎంపీలపై సస్పెన్షన్​ ఎత్తేయడానికి అభ్యంతరంలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి చెప్పారు. ఆ ఎంపీల ప్రవర్తనకు కాంగ్రెస్​తో పాటు మిగతా ప్రతిపక్షాలు బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వాలని స్పష్టంచేశారు.

రెండుసార్లు వాయిదా తర్వాత..

బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వా త ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై లోక్​సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. విజయ్​ చౌక్​లో  ఆందోళన సందర్భంగా మంగళవారం కొందరు ఎంపీలు అరెస్టు కావడంతో కాంగ్రెస్​ పార్టీకి చెందిన మిగతా ఎంపీలు కూడా సభకు హాజరు కాలేదు. పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్​ సభను రెండుసార్లు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె మాట్లాడారు. కాంగ్రెస్​ ఎంపీలపై విధించిన సస్పెన్షన్​ ఎత్తేయాలని ప్రతిపక్షాల తరఫున కోరుతున్నట్లు చెప్పారు. సభ్యుల సస్పెన్షన్​ ఎత్తివేస్తే ధరల పెరుగుదలపైన ప్రభుత్వం చేపట్టే చర్చలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నామని టీఎంసీ ఎంపీ సుదీప్​ బంద్యోపాధ్యాయ చెప్పారు. సభలో మంగళవారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని డీఎంకే ఎంపీ ఏ.రాజా అన్నారు.

రాజ్యసభలో అదే సీన్.. ఆప్​ఎంపీపై వేటు

బుధవారం కూడా రాజ్యసభ సజావుగా జరగలేదు. మంగళవారం 19 మంది ఎంపీలపై సస్పెన్షన్​ వేటు పడగా, బుధవారం మరో ఎంపీ సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ వారం మొత్తం ఈ 20 మంది ఎంపీలు సభకు హాజరయ్యేందుకు వీలులేదు. దేశంలో ధరల పెరుగుదలపై వెంటనే చర్చ జరగాలంటూ ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​ను డిప్యూటీ చైర్మన్​ హరివంశ్​ సస్పెండ్​ చేశారు. మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో సభ గురువారానికి వాయిదా పడింది.