ట్రంప్‎కు వ్యతిరేకంగా అమెరికాలో హోరెత్తిన నిరసనలు

ట్రంప్‎కు వ్యతిరేకంగా అమెరికాలో హోరెత్తిన నిరసనలు

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్‎కు వ్యతిరేకంగా సొంత దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. శనివారం పలు నగరాల్లో జనం వీధుల్లోకి వచ్చి.. ‘ట్రంప్​ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల లాస్​ఏంజెల్స్‎లో అక్రమవలసదారులపై ట్రంప్​ఉక్కుపాదం మోపడం.. ఆయన తీరుకు నిరసనగా జనం రోడ్లమీదికి రావడంతో చెలరేగిన నిరసనల మంటలు దేశమంతా విస్తరిస్తున్నాయి. 

శనివారం ఓ వైపు అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవాల్లో ట్రంప్​ బిజీగా ఉండగా.. మరోవైపు పలు నగరాల్లో ఆయనకు వ్యతిరేకంగా జనం ప్రదర్శనలు చేపట్టారు. పార్కుల్లో గుమిగూడి ఆందోళనలు నిర్వహించారు. వలసదారుల హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. పోర్ట్​లాండ్​ వంటి ఏరియాల్లో నిరసనకారులపైకి పోలీసులు టియర్​గ్యాస్​ప్రయోగించారు. 

సాల్ట్​లేక్​సిటీలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్, డెన్వర్, చికాగో, ఆస్టిన్, లాస్​ఏంజెల్స్‎లో వేల మంది రోడ్ల మీదికి వచ్చి ‘ట్రంప్​ గో బ్యాక్​.. నో కింగ్స్​” అంటూ నినదించారు. సియాటెల్‎లో దాదాపు 70వేల మంది ఆందోళనల్లో పాల్గొన్నారు.