యాదాద్రి జడ్పీ మీటింగ్‌‌లో ప్రొటోకాల్​ రగడ

యాదాద్రి జడ్పీ మీటింగ్‌‌లో ప్రొటోకాల్​ రగడ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జడ్పీ మీటింగ్​శుక్రవారం హాట్​హాట్​గా సాగింది. యాదాద్రి జడ్పీ చైర్మన్​ఎలిమినేటి సందీప్​రెడ్డి అధ్యక్షతన మీటింగ్​గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​పై చర్చకు సిద్ధమవడంతో ఆఫీసర్​ అనురాధ ముందుకు వచ్చారు. కాంగ్రెస్​ జడ్పీ ఫ్లోర్​లీడర్, ఆలేరు జడ్పీటీసీ డాక్టర్​ నగేశ్​ మాట్లాడుతూ స్థానిక సంస్థలకు స్టేట్ ​ఫైనాన్స్ ​ఫండ్స్​ రావడం లేదని, ప్రొటోకాల్​ పాటించకుండా తమను అగౌరపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేనప్పుడు పదవులెందుకని, అందరం మూకుమ్మడిగా రాజీనామా చేద్దామని, లేకుంటే వరుసగా మూడుసార్లు సభకు గైర్హాజర్​ అవుదామంటూ ప్రపోజల్​పెట్టారు. ప్రొటోకాల్​ విషయం అందరి సమస్య కాబట్టి దీనిపై తీర్మానం చేయాలంటూ నగేశ్​ కోరారు. దీంతో అసహనానికి గురైన జడ్పీ చైర్మన్ ​సందీప్​రెడ్డి.. మీరే వచ్చి అధ్యక్షత వహించమంటూ కామెంట్ ​చేయడంతో  పాటు ఇష్టం లేకుంటే వాకౌట్​ చేసి వెళ్లిపోండన్నారు. మైక్​ కట్​ చేయమని జడ్పీ చైర్మన్​ చెప్పడంతో నగేశ్​ మైక్​ కట్ చేస్తారా.. తీసుకోండి అంటూ మైక్, జడ్పీ నివేదిక బుక్​ విసిరేశారు. ఎవరి కోసం మీటింగ్​ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్​ మెంబర్లు వచ్చి పోడియం వద్ద బైఠాయించారు. దాంతో మీటింగ్​ నా కోసమే, నా ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తా.. యాక్ట్​ చదువుకోండని చైర్మన్​ అన్నారు. అనంతరం అగ్రికల్చర్​ ఆఫీసర్ ను మాట్లాడమని సూచించారు. రైతు వేదిక విషయంలో ఆఫీసర్లు ప్రొటోకాల్​ పాటించలేదని ఎంపీపీ రమేశ్​అన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి చెప్పడంతో పీఏసీఎస్​ చైర్మన్​పేరు శిలాఫలకంపై రాయించినట్లు డీఏవో చెప్పారు.  ప్రారంభోత్సవం అప్పుడు తీసేశామని అన్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడికి ఎవరూ తలొగ్గద్దని, ప్రొటోకాల్​ ప్రకారం ఆఫీసర్లు నడుచుకోవాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సూచించారు. శిలాఫలకంపై ఇతరుల పేర్లు రాయాలని ఎమ్మెల్యే చెప్పినట్టు సాక్ష్యం ఉందా అంటూ అగ్రికల్చర్​ ఆఫీసర్​ అనురాధను జడ్పీ చైర్మన్​నిలదీశారు. మీరు తప్పు చేసి సభలో లేని ఎమ్మెల్యే మీద నింద వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా విషయంలోనూ అగ్రికల్చర్​ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో డీఏవో లేదా ఏఈవోపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు. సభలో గొడవ జరగడం బాధాకరంగా ఉందని కలెక్టర్​ పమేలా సత్పతి అన్నారు. ఇలాంటి ఘటనలు సభ గౌరవానికి భంగం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లూ బుక్​ ప్రకారం ప్రొటోకాల్​ నిర్వహణ ఉండాలని చెప్పారు.

హాస్పిటల్​ కెళితే ఆపరేషన్​ చేయలే

కంటి మీద కురుపు ఉందని జిల్లా హాస్పిటల్​లో గర్భిణికి ఆపరేషన్​ చేయకుండా పంపించారని బీబీనగర్​ ఎంపీపీ సుధాకర్​ చెప్పారు. దీంతో వారు ప్రైవేట్​ హాస్పిటల్​కు వెళితే రూ. 30 వేలు ఖర్చయిందన్నారు. నిరుపేద ఎస్సీ గర్భిణి విషయంలో తాను చెప్పినా పట్టించుకోలేదన్నారు. వడ్ల కొనుగోలు చర్చలో ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటామని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెప్పారు. రోడ్లపై జరిగిన చర్చలో పలువురు మెంబర్లు మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోవడానికి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు లేవా.. గవర్నమెంట్​ బిల్లులు ఇస్తలేదా అని నిలదీశారు.