
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై.. ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోని వారు, ఇంటి నిర్మాణం పూర్తి చేయని లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఆ వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ సెక్రటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పొందినవారిని ఆల్రెడీ ఇల్లు తీసుకున్న లబ్ధిదారుడి కోటా కింద పరిగణించి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయలేదు. అయితే, ప్రజాపాలనలో ఈ కేటగిరీకి చెందిన వేలాది మంది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అప్లికేషన్ పెట్టుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇండ్లు మంజూరై సొంత పైసలతో బేస్ మెంట్ వరకు కట్టుకొని, ప్రభుత్వం నుంచి సాయం అందుకోకుండా, బేస్ మెంట్ వరకు ప్రభుత్వం నుంచి సాయం తీసుకొని వదిలేసిన వివరాలు పంపాలని ఆదేశాల్లో సెక్రటరీ పేర్కొన్నారు. వీళ్లంతా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని మంత్రులను, ఎమ్మెల్యేలను కోరిన నేపథ్యంలో ప్రభుత్వం వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు సైతం ఇలాంటి ఉదాహరణలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వివరాలు వచ్చిన తరువాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగతా ఇంటి నిర్మాణం పూర్తవడానికి అయ్యే అమౌంట్ ఇందిరమ్మ స్కీమ్ కింద ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది.