ఫ్రెండ్ భార్యని అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గుడు..!

ఫ్రెండ్ భార్యని అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గుడు..!

మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని కొత్త చెరువు ప్రాంతంలో ఈనెల 5న కనిపించిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు సాల్వ్ చేశారు. నిందితుడు అరుణ్ కుమార్ ను డిసెంబర్ 18 బుధవారం నాడు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లికి చెందిన అరుణ్ కుమార్ పలు నేరాలు చేసి జైలుకు వెళ్లివచ్చాడు. ఏడాదిన్నరపాటు చంచల్ గూడ జైలులో ఉండి.. ఈ మధ్య బెయిల్ పై విడుదలయ్యాడు. సొంతూరు సుద్దపల్లిలో ఉంటూ కోర్టుకు హాజరవుతున్న క్రమంలో అరుణ్ కుమార్ కు… నిజామాబాద్ కు చెందిన రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అరుణ్ గత నవంబర్ 30న కేసు విషయంలో రాజుకు ఫోన్ చేసినప్పుడు. అతడి భార్య మాట్లాడింది. కేసు విషయంలోనే డిసెంబర్ 2న కోర్టు దగ్గర మరోసారి ఆమెను కలిశాడు. ఆమెను లోబర్చుకోవాలనే ఉద్దేశంతో తన ఇంటికి తీసుకెళ్లి టీవీని గిఫ్ట్ గా ఇచ్చాడు. రాజు ఓ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నాడని.. అతడికి బెయిల్ ఇప్పిస్తానంటూ ఆమెకు దగ్గరవ్వాలని ప్లాన్ వేశాడు.

ఆమెను కలిసేందుకు నిజామాబాద్ లోని ఇంటికి వెళ్లాడు అరుణ్. షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి కొన్ని వస్తువులకు ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత తాను దొంగతనాలు చేసి చాలా డబ్బులు, బంగారం సంపాదించానని.. వాటిని ఒకచోట భూమిలో దాచిపెట్టానని చెప్పి ఆమెను నమ్మించాడు. పాతిపెట్టిన డబ్బులు, బంగారం తీసుకొద్దామని చెప్పి ఈనెల 5న నిజామాబాద్లో ఆమెను స్కూటీపై ఎక్కించుకుని రామాయంపేట శివారులోని కొత్త చెరువుకు పిలుచుకెళ్లాడు. రాత్రి 7:30 గంటల సమయంలో పొలాల మధ్య తవ్వుతున్నట్టుగా నటించాడు. ఆమెకు అతనిపై అనుమానం వచ్చి అసలు డబ్బులు ఇక్కడ ఉన్నాయా? లేవా? అని గట్టిగా నిలదీసింది. దీంతో డబ్బుల కోసమే నా వెంట వచ్చావా? అరిస్తే చంపుతా’ అంటూ ఆమెను బెదిరించాడు. తర్వాత ఆమెపై అత్యాచారంచేశాడు. విషయం ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో ఆమె గొంతు నులిమి…. మఫ్లర్ గొంతుకు బిగించి హత్య చేశాడు. తర్వాత పక్కనే ఉన్న నీటి గుంతలో డెడ్ బాడీని పడేశాడు. బాధితురాలి రెండు సెల్ ఫోన్లు,ఆధార్ కార్డులను, స్కూటీ ఆర్సీ, లైసెన్సులను కాల్చేశాడు.

బాధితురాలి స్కూటీతో వెళ్లిపోయిన అరుణ్.. తన ఫోన్ సిమ్ కార్డులను తీసేసి ఆరోజు ఇంట్లోనే ఉన్నాడు. మరుసటి రోజు నిజామాబాద్ కు వెళ్లి స్కూటీ నంబర్ ప్లేట్ తీసేసి దానిమీద ప్రెస్ అని రాయించాడు. బుధవారం డిసెంబర్ 18న ఉదయం స్కూటీపై నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరాడు. దామరచెరువు బైపాస్ రోడ్ లో పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా.. అరుణ్ తీరు అనుమానాస్పదంగా కనిపించింది. మృతి చెందిన మహిళ స్కూటీ చాసిస్ నంబర్ అరుణ్ దగ్గర ఉన్న స్కూటీ చాసిస్ నంబర్ మ్యాచ్ కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించినప్పుడు మహిళను తానే హత్య చేసినట్టు అతడు అంగీకరించాడని… తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ చెప్పారు.

మహిళను అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితుడు అరుణ్ కు చాలా క్రైమ్ హిస్టరీ ఉంది. 2015లో నిజామాబాద్ జిల్లా దుబ్బకు చెందిన జ్యోతితో పెళ్లి జరిగింది. అతని ప్రవర్తన నచ్చక 3 రోజులకే దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టి తర్వాత విడాకులు తీసుకుంది. తర్వాత 6 నెలలకు ముధోల్ గ్రామానికి చెందిన నవనీతను పెళ్లి చేసుకున్నాడు. 8 నెలల తర్వాత ఆమె కూడా విడాకులిచ్చింది. తర్వాత ఆర్మూర్ మండలానికి చెందిన లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. 2016లో ఆర్మూర్ లో ఆటోడ్రైవర్ ను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. జైలుకెళ్లిన తర్వాతి రోజే ఛాతిలో నొప్పి వస్తోందంటూ నమ్మించాడు. ఆసుపత్రికి వెళ్తుండగా తప్పించుకున్నాడు. తర్వాత నరేశ్ అనే వ్యక్తి కళ్లలో కారం చల్లి బైక్ ను ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో 65 రోజులు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చి 2018లో హైదరాబాద్ లోని తిరుమలగిరిలో ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తూ బంగారం దొంగిలించి జైలుకు వెళ్లాడు. ఈ టైంలో 2016లో పోలీసుల నుంచి తప్పించుకున్న కేసులో మూడేళ్లు శిక్ష పడింది. ఈ మధ్య బెయిల్ పై వచ్చాడు. వాయిదాలకు కోర్టుకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో రామాయంపేట దగ్గర మహిళను రేప్ చేసి, హత్య చేశాడు.