ఎప్పుడూ మద్యం మత్తులోనే.. గొడవ పెద్దదైతే హత్యలు

ఎప్పుడూ మద్యం మత్తులోనే.. గొడవ పెద్దదైతే హత్యలు

సిటీలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ మహమ్మద్ ఖాదీర్‌‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్‌ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుల వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాకు వివరించారు. మహమ్మద్ ఖాదీర్ గత నెల హబీబ్ నగర్ లో, నాంపల్లి పీఎస్ పరిధిలో రెండు  మర్డర్లు చేశాడన్నారు. నిందితుడు కర్ణాటకలోని బీదర్ నుంచి 15 ఏండ్ల వయసులో హైదరాబాద్‌కు వలస వచ్చాడని, కుటుంబ నేపథ్యం, బాల్యం సరిగా లేదని తెలిపారు. ఖాదీర్‌‌ ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడని, మద్యానికి బానిసై సైకో లాగా ప్రవర్తించేవాడని సీపీ అన్నారు. ఇతడు హత్య చేసిన వారిలో బాధితులు ఎక్కువగా బెగ్గర్స్‌ అని సీపీ అంజనీ కుమార్‌‌ చెప్పారు. మొదట 2017లో ఒక ఆస్తి వివాదం గొడవలో మర్డర్ చేసి అరెస్ట్ అయ్యాడని, బెయిల్‌పై వచ్చాక మళ్లీ 2019లో మరో మర్డర్‌‌ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిపారు.

2021 ఏప్రిల్‌లో మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చిన ఖాదీర్ ఇటీవల దసరా రోజు హబీబ్‌ నగర్‌‌ పీఎస్‌ పరిధిలో మరో మర్డర్‌‌ చేశాడని, ఆ తర్వాత అక్టోబర్ 31న నాంపల్లి, హబీబ్‌నగర్‌‌లలో రెండు మర్డర్లు చేశాడని అంజనీకుమార్‌‌ చెప్పారు. ఖాదీర్‌‌ కొన్నాళ్లుగా బోరబండలో ఉంటున్నాడని, రోజు వారీ ఖర్చుల కోసం అడ్డా కూలీగా, ఆటో డ్రైవర్‌‌గా పని చేస్తుంటాడని అన్నారు. నిందితుడి మెంటల్‌ కండిషన్‌ సరిగా ఉండేది కాదని, సైకోలా ప్రవర్తించేవాడని, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవపడే మనస్తత్వం అని, గొడవ పెద్దది అయితే మర్డర్లు చేసేవాడని తెలిపారు.