- ప్రియుడు ఫారుక్ ను విచారిస్తున్న పోలీసులు
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ సిటీ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో పబ్ డ్యాన్సర్అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. సీఐ వెంకట్రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాబౌలి చార్మినార్ ప్రాంతానికి చెందిన రేణుక(26) పబ్ డాన్సర్ గా పని చేస్తోంది. 8 ఏండ్ల కింద రేణుకకు వివాహం జరగగా, ఆమెకు నాలుగేండ్ల కొడుకు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో ఇద్దరు వేరుగా ఉంటున్నారు. ఏడేండ్లుగా రేణుక పబ్ లో డాన్సర్ గా పని చేస్తోంది. పబ్‌లో గోల్కొండ ప్రాంతానికి చెందిన డెయిరీ ఫామ్ నడిపే ఫారుఖ్ రేణుకకు పరిచయమయ్యాడు. ఆరు నెలలుగా వీరిద్దరూ లంగర్ హౌస్ ఆంధ్ర ఫ్లోర్ మిల్ లో ఉన్న వి గ్రాండ్ హోటల్ కు వచ్చేవారు. గురువారం రాత్రి కూడా హోటల్‌కు వచ్చారు. ఫారుఖ్ సమీపంలో ఉన్న క్లాసిక్ గార్డెన్ లో ఫంక్షన్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. వేకువజామున హోటల్ కు వచ్చే సరికి రేణుక ఫ్యాన్ కు ఉరేసుకుందని పోలీసులకు తెలిపాడు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫారుఖ్ ను లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రేణుకది హత్యనా? ఆత్మహత్యనా?
అనే విషయం దర్యాప్తులో తేలనుంది. తన చెల్లెను హత్య చేశారని రేణుక అక్క సోనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రేణుకది హత్యే!రేణుకది ఆత్మహత్య కాదని హత్యేనని హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. రేణుక హత్య విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రేణుక హత్య విషయం తెలుసుకున్న కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలకు చెందిన హిందూ సంఘాల ప్రతినిధులు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఈ ఘటనపై ఆరా తీశారు. బంగారి ప్రకాశ్, అల్వాల ఇంద్రసేనారెడ్డి, ఉదయ్ కుమార్, ఆకుల గోవర్ధన్, పూర్ణ చందర్ రావు, వినేశ్ సింగ్ మాట్లాడుతూ.. హిందూ మహిళలను లవ్ జిహాద్ పేరుతో లోబర్చుకొని హత్య చేస్తున్నారని ఆరోపించారు.
