- బాధితుల్లో చిన్నారులు, యువకులే ఎక్కువ
- సాల్మొనెల్లా స్టాన్లీ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు గుర్తింపు
- ఉక్రెయిన్ కంపెనీ ఉత్పత్తులపై అనుమానాలు
బ్రస్సెల్స్: ఇన్‌స్టంట్ నూడుల్స్ తిని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)తోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ)లోని 13 దేశాలలో 106 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది యువకులు, చిన్నారులే కాగా.. వారిలో 49 మంది హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉందని ఈయూ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి.
అయితే, ఫ్లేవర్డ్ ఇన్‌స్టంట్ నూడుల్స్ ద్వారా సాల్మొనెల్లా స్టాన్లీ(ఎస్టీ2045) అనే రకం బ్యాక్టీరియా వ్యాప్తి చెందిందని, దాని కారణంగానే చాలామంది అస్వస్థతకు గురయ్యారని ఈయూ ఫుడ్ సేఫ్టీ అథారిటీ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. పోయినేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్వీడన్, యూకేలో ఈ కేసులు నమోదైనట్లు గుర్తించింది.
ఉక్రెయిన్‌లో తయారైన నూడుల్స్‌తోనే..
ఉక్రెయిన్‌లోని ఓ కంపెనీ తయారు చేసిన ఫ్లేవర్డ్ ఇన్‌స్టంట్ నూడుల్స్ వల్లే ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఇన్ఫెక్షన్ సోకినట్లు దర్యాప్తులో తేలింది. చికెన్, హాట్ చికెన్, బీఫ్, డక్, శ్రింప్, కర్రీ, వెజిటబుల్ ఫ్లేవర్లలో తయారైన ఈ నూడుల్స్.. ముందుగా పోలాండ్‌కు ట్రాన్స్‌పోర్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ఓ హోల్‌సేల్ కంపెనీ ద్వారా జర్మనీ, లిథువేనియా, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, యూకే వంటి 14 దేశాలకు సప్లయ్ అయ్యాయి.
మొదట జర్మనీ, లిథువేనియాలో మార్కెట్ నుంచి సేకరించిన చికెన్, హాట్ చికెన్ ఫ్లేవర్ నూడుల్స్‌లో సాల్మొనెల్లా స్టాన్లీ బ్యాక్టీరియా ఉన్నట్లు ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. ఆపై డెన్మార్క్, ఎస్టోనియా, జర్మనీ, లాత్వియా, లిథువేనియా దేశాల్లోనూ అనారోగ్యానికి గురైనవారంతా అదే బ్రాండ్ నూడుల్స్ తిన్నట్లు దర్యాప్తులో బయటపడింది.
ఒక్క బ్రాండ్.. రకరకాల బ్యాక్టీరియాలు
లిథువేనియాలో పరీక్షించిన నూడుల్స్‌లో సాల్మొనెల్లా రిచ్‌మండ్, సాల్మొనెల్లా న్యూపోర్ట్ అనే మరో రెండు రకాల బ్యాక్టీరియాలు బయటపడ్డాయి. చికెన్ ఫ్లేవర్ నూడుల్స్‌లో సాల్మొనెల్లా సెన్‌ఫ్టెన్‌బర్గ్ అనే ఇంకో రకం బ్యాక్టీరియాను గుర్తించారు. దీంతో.. ఇదంతా ఒకేసారి జరిగింది కాదని, ఉత్పత్తి ప్రక్రియలోని పలు దశల్లో లేదా వేర్వేరు మసాలా దినుసుల ద్వారా నూడుల్స్‌లో కలుషితం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
స్టాక్ రీకాల్ చేసినా ప్రమాదం తప్పేలా లేదు..
ఎఫెక్ట్ పడిన దేశాల్లో సంబంధిత నూడుల్స్ ప్యాకెట్ల మొత్తం స్టాక్‌ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇంకా కొంతమంది బ్యాక్టీరియా బారిన పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన నూడుల్స్ ప్యాకెట్లు చాలామంది ఇండ్లలో నిల్వ ఉండే అవకాశం ఉందని, దాంతో కొత్త కేసులు నమోదు కావొచ్చని చెప్తున్నారు.
అయితే, ఈ బ్యాక్టీరియాల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని స్పష్టం చేశారు. బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతున్నట్లు గుర్తించగానే సంబంధిత కంపెనీ.. మార్కెట్‌లో ఉన్న నూడుల్స్ స్టాక్ మొత్తాన్ని వాపస్ తీసుకుందని తెలిపారు.
ఈ నూడుల్స్ తింటే..
సాల్మొనెల్లా సోకితే విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతులు చికిత్స లేకుండానే కోలుకుంటారు. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
