- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
- పది అంశాలతో కూడిన వినతిపత్రాలు అందజేత
న్యూఢిల్లీ, వెలుగు: వ్యవసాయం, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి కీలక రంగాలలో తెలంగాణ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు, వివిధ రంగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పది ప్రాజెక్టులకు సహకరించాలని వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రానికి రెండవ మల్టిమోడల్ లాజిస్టిక్ పార్క్(ఎంఎంఎల్‌పీ)ని కేటాయించి, భారత్‌మాల ఫ్రేమ్‌వర్క్ కింద కేంద్ర ప్రభుత్వ సహ-పెట్టుబడులకు అవకాశం కల్పించాలని కోరారు. జాతీయ లాజిస్టిక్స్ విధానం, పీఎం గతి శక్తి లక్ష్యాలకు అనుగుణంగా లాజిస్టిక్స్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. రూ. 10 వేల కోట్ల నిధుల ఫ్రేమ్‌వర్క్ పరిధిలో తెలంగాణను ఒక కంటైనర్ తయారీ క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.
హైదరాబాద్‌లో డీసీ ఆఫీసు పెట్టండి..
తెలంగాణ ఎగుమతుల వృద్ధిని పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లో స్వతంత్ర డెవలప్మెంట్ కమిషనర్ (డీసీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని శ్రీధర్ బాబు కోరారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఎగుమతులు, సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ప్రస్తుత డీసీ ఆఫీసు విశాఖపట్నంలో ఉండడం సరికాదన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు, పసుపు ఎండబెట్టడం, ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ కోసం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే, కరీంనగర్ జిల్లాలో స్పైస్ బోర్డ్ లాబొరేటరీని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పత్తి పండే ప్రధాన జిల్లాలైన వరంగల్ లేదా ఆదిలాబాద్‌లలో సీఐఆర్‌సీఓటీ (సీఐఆర్ సీఓటీ) భాగస్వామ్యంతో కాటన్ టెస్టింగ్ లాబొరేటరీని ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతను పరీక్షించి పత్తి, వస్త్ర రంగాల ఎగుమతులను ప్రోత్సహించవచ్చని తెలిపారు. ఫార్మా రంగానికి ఊతమిచ్చేలా అత్యాధునిక వ్యాక్సిన్ టెస్టింగ్ లాబొరేటరీని, వైద్య పరికరాల తయారీదారుల కోసం కామన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
