ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో అశ్లీల ప్రకటనలు.. మెటాకు కేంద్రం సమన్లు!

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో అశ్లీల ప్రకటనలు.. మెటాకు కేంద్రం సమన్లు!

న్యూఢిల్లీ: ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పిల్లల లైంగిక వేధింపులను ప్రోత్సహించే ప్రకటనలు రావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ కోరుతూ ‘మెటా’ అధికారులకు సమన్లు జారీ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. భారత్‌‌లో పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్‌‌ను ప్రోత్సహించే ప్రకటనలను ఇన్‌‌స్టాగ్రామ్‌‌ రన్ చేస్తోందని ‘బీబీసీ’ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. రూ. 99లకే అశ్లీల కంటెంట్‌‌ను విక్రయించే కొన్ని టెలిగ్రామ్ లింకులతో ఈ ప్రకటనలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది.

 దీనిపై తాము ఫిర్యాదు చేసినా, ఆ పోస్టులు తమ నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ మొదట సమాధానమిచ్చిందని బీబీసీ తెలిపింది. తర్వాత ఆ ప్రకటనలను నిలిపివేసి, సదరు అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు వివరించింది. మరోవైపు, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లోని కొన్ని ఫీచర్లు ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడానికి దారితీస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశంపై టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌‌లకు కూడా కేంద్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.