పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కావొద్దు : మంత్రి సీతక్క

పన్నుల వసూళ్లే  పనితీరుకు కొలమానం కావొద్దు : మంత్రి సీతక్క
  •     ఆదివాసీ, గిరిజన, వెనుకబడిన జీపీల‌‌‌‌కు వెసులుబాటు కల్పించాలి: మంత్రి సీతక్క
  •     16వ ఆర్థిక సంఘం జాతీయ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో కేంద్రానికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకూడదని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క సూచించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, ఓన్ సోర్స్ రెవెన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు. శుక్రవారం కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై భారత్ మండపంలో కీలక సమావేశం జరిగింది. 

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజ‌‌‌‌న్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో తెలంగాణ తరఫున మంత్రి సీతక్క, స్పెష‌‌‌‌ల్ సీఎస్ దాన‌‌‌‌కిషోర్ హాజరయ్యారు. సీత‌‌‌‌క్క మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందన్నారు. ఆదాయం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మారుమూల ప్రాంతాల పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపేలా నిబంధనలు ఉండకూడదని చెప్పారు. బలమైన గ్రామ పంచాయతీలు, రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్రాలకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలన్నారు. 

సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేస్తూనే పంచాయతీలను మరింత శక్తివంతం చేసేలా 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలని మంత్రి సీత‌‌‌‌క్క సూచించారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా అన్‌‌‌‌టైడ్ బేసిక్ గ్రాంట్లను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫ్‌‌‌‌ఎంఎస్ వంటి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగ‌‌‌‌తిస్తోంద‌‌‌‌న్నారు. మరోవైపు, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో సీతక్క భేటీ అయ్యారు. అంగన్‌‌‌‌వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.