మీ ప్రభుత్వం ఎందుకు ఉంది..? బీఆర్ఎస్ పై పబ్లిక్ ఆగ్రహం

మీ ప్రభుత్వం ఎందుకు ఉంది..? బీఆర్ఎస్ పై పబ్లిక్ ఆగ్రహం
  • డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంకెప్పుడు పూర్తి చేసి ఇస్తారని  స్థానికుల మండిపాటు 
  • భోజగుట్టలో వాగ్వాదంతో ముగిసిన అఖిలపక్ష సమావేశం

మెహిదీపట్నం, వెలుగు : “ మేం.. మేం కొట్లాడుకొని చావమంటారా..?  పోలీస్ స్టేషన్ల చుట్టూ,  కోర్టుల చుట్టూ తిరగమంటారా..? మీ ప్రభుత్వం ఎందుకు ఉంది..? మిమ్మల్ని ఎవరు అడిగారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వమని..?  కేటీఆర్ ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు..? అని భోజగుట్ట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీఆర్ఎస్ నేతలపై బస్తీ వాసులు, మహిళలు మండిపడ్డారు. నాంపల్లి సెగ్మెంట్​లోని గుడి మల్కాపూర్ డివిజన్ భోజగుట్టలో  డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపై ఆదివారం మూడు బస్తీలకు చెందిన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి బంగారు ప్రకాశ్, జీవన్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్,  కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్, వేణుగోపాల్, బీఎస్పీ నుంచి చిరంజీవి, అంజయ్య, సీపీఎం నుంచి వెంకటేశ్, మల్లేశ్ తో పాటు స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు శంకర్ హాజరవగా.. ఎంఐఎం, బీజేపీ నుంచి గైర్హాజరయ్యారు.  

ఈ సమావేశం మొదలైనప్పటి నుంచి రసాభాసగా కొనసాగింది.  “ 200 మంది పట్టాలు కావాలని కోర్టును ఆశ్రయించారు. మిగిలిన వారు ఇండ్లను నిర్మించాలని మొదటి నుంచి పట్టుబట్టారు.  చివరిక్షణంలో మీరు మీరు తేల్చుకోండి. ఆ 200 మందిని కొట్టి తరిమేయండి’’ అంటూ బంగారు ప్రకాశ్ మాట్లాడగా  ఒక్కసారిగా బస్తీ వాసులు ఆగ్రహం చెందారు. కొద్దిసేపు బీఆర్ఎస్ నేతలకు,  బస్తీ వాసులకు  మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో బీఆర్ఎస్ నేతలు మధ్యలోనే వెళ్లిపోయారు. అనంతరం నాంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ..  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అర్హులకు ఇళ్లు అందిస్తామని  హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి 10 వేలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. 

ఆరేళ్లుగా పూర్తి చేయడం లేదని.. 

భోజగుట్టలో  శ్రీరామ్‌‌నగర్, శివాజీ నగర్, వివేకానందనగర్‌‌‌‌లో పది వేల మంది బస్తీ వాసులు 40 ఏళ్లుగా నివసిస్తున్నారు.  రాష్ట్రం ఏర్పడ్డాక 3 బస్తీల ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని  బీఆర్ ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.  2017 ఎస్‌‌ఈఎస్ సర్వే ప్రకారం 13.6 ఎకరాల స్థలాన్ని  కేటాయించి 1,824  ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టింది. అదే ఏడాది అక్కడ ఉన్న గుడిసెలను తొలగించి 570  మందిని ఖాళీ చేయించారు. ముందుగా  240 ఇండ్లను నిర్మించి మిగతా వాటి పనులను ఆరేళ్లుగా పూర్తి చేయడం లేదని బస్తీవాసులు వాపోయారు.