నవంబర్ 17,18 తేదీల్లో 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం : ఎండీ వీపీ గౌతమ్

 నవంబర్  17,18 తేదీల్లో 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం : ఎండీ వీపీ గౌతమ్
  • రిజిస్ట్రేషన్ గడువు: ఎండీ వీపీ గౌతమ్​ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సమీపంలోని తొర్రూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పల్లి, కుర్మల్‌‌‌‌‌‌‌‌గూడ ప్రాంతాల్లో ఉన్న 163  రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం జరగనుంది. స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ  లేఅవుట్‌‌‌‌‌‌‌‌లల్లో ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సౌలతులున్నాయి. అందువల్ల ఈ ప్లాట్లపై కొనుగోలుదారుల్లో ఆసక్తి ఏర్పడిందని కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను ఈ నెల17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

 తొర్రూర్ లో200 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్ గూడలో 200 నుంచి -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200 నుంచి -1000 గజాల్లోని 13 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు పెద్ద అంబర్ పేట్ లోని అవికా కన్వెన్షన్ లో , 18 వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్ పల్లి, కుర్మల్ గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు గౌతమ్ పేర్కొన్నారు.  

నచ్చిన ప్లాట్ కోసం స్వయంగా వెళ్లి.. 

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్లపై జనం చాలా ఆసక్తి చూపుతున్నారు. తొర్రూర్ లోని ప్రాజెక్టు సైట్ లోని ప్లాట్లను స్వయంగా చూసుకుని నచ్చిన ప్లాట్ల నెంబర్లను నోట్ చేసుకుంటున్నారు. తొర్రూర్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌లోని 885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించారు. మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. 

ఈ ప్రాంతంలో గృహావసరాల భూములకు భారీ డిమాండ్ ఉండటం, ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి కనపరుస్తున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తూ, ఇప్పటికే అక్కడ ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో మాట్లాడటంతోపాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటున్నారు.