ప్రజా పాలనతో ప్రతి ఇంటికీ లబ్ధి

ప్రజా పాలనతో ప్రతి ఇంటికీ లబ్ధి
  •     మహిళలకు ‘మహాలక్ష్మి’.. రైతుకు ‘రుణమాఫీ’ 
  •     500లకే గ్యాస్ సిలిండర్.. 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్
  •     రెండేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా గణాంకాల విడుదల

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన పేరుతో అధికా రం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులున్నా.. 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న సర్కారు.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు విడుద ల చేసినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీలో రోజుకు సగటున 34 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 8,402 కోట్లు ఆర్టీసీకి చెల్లించింది. 

ఇక వంటింటి బండ భారం తగ్గిస్తామని చెప్పిన సర్కారు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా దాదాపు 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం సబ్సిడీ కింద ఇప్పటికే దాదాపు రూ.700 కోట్లు ఖజానా నుంచి విడుదల చేసింది. రైతు సంక్షేమానికి పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ  వల్ల 25.35 లక్షల మంది రైతులకు మేలు జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ. 20,616 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. ఇక పెట్టుబడి సాయం రైతు భరోసా ద్వారా 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 8,744 కోట్లు జమ చేసినట్టు పేర్కొంది. సన్న వడ్లకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, దీనికోసం రూ. 314 కోట్లు చెల్లించినట్టు చెప్పింది. 

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 3,200 కోట్లు రిలీజ్

పేదలకు గూడు కల్పిస్తామంటూ ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూ. 3,200 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని.. లక్షలాది ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది. ఇక గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. దీనివల్ల 52 లక్షల కుటుంబాలకు జీరో బిల్లులు వస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. 

ఈ సబ్సిడీ కింద డిస్కంలకు రూ.3,438 కోట్లు చెల్లించినట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. విద్య, వైద్య రంగాల్లోనూ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినట్టు సర్కారు పేర్కొంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు చికిత్స అందిస్తున్నామని చెప్పింది. 

ఇందుకోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక విద్య విషయానికొస్తే, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని.. వీటికి రూ. 15,600 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం చాలా చోట్ల ఈ పాఠశాలలు  నిర్మాణ దశలోనే ఉన్నాయని పేర్కొంది.