గడీల పాలన గ్రామాలకు..28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన

గడీల పాలన గ్రామాలకు..28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన
  • గడీల పాలన గ్రామాలకు 
  • రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన
  • ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తం
  • ఇతర సమస్యలపైనా అర్జీలు తీసుకుంటం
  • తహసీల్దార్, ఎంపీడీవో టీములు డివైడ్ చేసినం
  • విత్ డ్రాయల్ సిమ్ టమ్స్ తో కేటీఆర్ అట్ల మాట్లాడుతుండు
  • అసెంబ్లీలో కనిపించింది బావా బావమర్దుల ఆరాటమే 
  • ఇప్పటి వరకు ప్రజావాణిలో 24వేల దరఖాస్తులొచ్చాయ్
  • కేటీఆర్ తో రూ. లక్ష ఇప్పించడం ద్వారా ప్రజావాణి సక్సెస్
  • వంద కోట్లలో మిగతా డబ్బునూ కూడా కక్కించి తీరుతం
  • ఉర్దూలో దరఖాస్తులు తయారు చేశాం.. సెపరేట్ కౌంటర్లు పెడ్తున్నం

హైదరాబాద్ : పదేండ్లుగా గడీలలో బందీ అయిన పాలనను గ్రామాలకు చేర్చడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ సచివాలయంలో ఆయన ప్రజాపాలన  పోస్టర్ ను, దరఖాస్తు ఫారాన్ని, లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహిస్తామని, ఎంపీడీవోలు, తహశీల్దార్ రెండు టీములగా విడిపోయి సభకు హాజరవుతారని, ఉదయం ఒక గ్రామంలో మధ్యాహ్నం మరో గ్రామంలో గ్రామ సభలు ఉంటాయని సీఎం చెప్పారు. 

ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తు స్వీకరించబోతున్నామని చెప్పారు. ఇంకా వేరే సమస్యలపై దరఖాస్తులు తీసుకునేందుకు అక్కడే మరో కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా గ్రామసభకు రావడం మిస్ అయితే స్థానిక పంచాయతీ కార్యాలయాల్లో ఈ ఎనిమిది రోజుల పాటు ఎప్పుడైనా దరఖాస్తు అందించవచ్చని చెప్పారు. ఆ తర్వాత కూడా తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తులు అందించవచ్చని చెప్పారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ఙిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. 

ప్రజావాణికి  24వేల దరఖాస్తులు  

ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు 24 వేల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో ఒక దరఖాస్తు దారుకు న్యాయం జరగలేదని, తెలంగాణ భవన్ లో లక్ష రూపాయలను మాజీ మంత్రి కేటీఆర్ అందించారన్నారు. వాళ్లు చేసిన లక్ష కోట్ల అవినీతిలోంచి ఇచ్చారని, దీని వల్ల ప్రజావాణి కార్యక్రమం సక్సెస్ అయినట్టు తాము భావిస్తున్నామని చెప్పారు. మిగతా డబ్బులను కూడా కక్కిస్తామని అన్నారు. కేటీఆర్ విత్ డ్రాయల్ సిమ్ టమ్స్ తో ఏమేమో మాట్లాడుతున్నారని, ఆయనను ఒక మంచానికి కట్టేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బావాబావమర్దుల ఆరాటమే తప్ప మిగతా సభ్యులు ఒక్కరు కూడా ఆ పార్టీ నుంచి లేచి మాట్లాడలేదన్నారు. 

గ్రూప్ 2 పై నిర్ణయం 

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కమిషన్ కు చైర్మన్ ను, పాలకమండలి నియమించాల్సి ఉందని, అవి పూర్తయితేనే పరీక్షల నిర్వహణకు ముందడుగు వేయవచ్చని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.