అపార్టుమెంట్లు కట్టి 11 ఏళ్లు.. ఇళ్ల కండీషన్ చూసి..

అపార్టుమెంట్లు కట్టి 11 ఏళ్లు.. ఇళ్ల కండీషన్ చూసి..
  • రాజీవ్ స్వగృహ లబ్దిదారుల పునరాలోచన
  • 11ఏళ్లయినా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు వీడని గ్రహణం

హైదరాబాద్ నగరంలోని రాజీవ్ స్వగృహ ఇండ్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.  వేలంలో ప్లాట్లను  దక్కించుకున్న వారు  ఇప్పుడు... వాటిని  తీసుకోవడానికి  అంతగా ఇంట్రస్ట్  చూపించడం లేదు.  బండ్లగూడ, పోచారంలోని  ప్లాట్లకు  30 వేలకుపైగా  దరఖాస్తులు వచ్చాయి. అయితే లాటరీ తరువాత వాటిని తీసుకోవడానికి మాత్రం చాలా మంది ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

హైదరాబాద్ నగర శివారులో ఉన్న బండ్లగూడ, పోచారంలో ఉన్న 2 వేల 971 ఫ్లాట్లకు వేలం నిర్వహించింది ప్రభుత్వం. ప్లాట్లను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 30 వేల అప్లికేషన్లు వచ్చాయి. జూన్ 22 న డిజిటల్ లాటరీతో ప్లాట్లు అలాట్మెంట్ చేశారు అధికారులు. లాటరీ లో ఫ్లాట్ వచ్చిన వారు మూడు విడతలుగా డబ్బులు చెల్లించాల్సి ఉంది. టోకెన్ అడ్వాన్స్ గా సేల్ వాల్యూలో 10 శాతం... లాటరీలో వచ్చిన తరువాత 7 రోజుల లోపు మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుందని మొదట చెప్పారు. జూలై 12 వ తేదీ వరకు మొదట వాయిదా డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ మొదట వాయిదా చెల్లించడానికి జనాలు ముందుకు రాకపోవడంతో జూలై లాస్ట్ వరకు మొదటి విడత వాయిదా గడువు పెంచింది ప్రభుత్వం.

మొదటి నుండి ప్లాట్ల వేలం, కేటాయింపుల్లో హెచ్ఎండీఏ (HMDA) అధికారులు జనాలకు పూర్తి క్లారిటీ ఇవ్వలేదనే విమర్శలున్నాయి. అన్ డివైడ్ షేర్, పార్కింగ్ స్థలం కొనుగోలు, క్లబ్ హౌజ్, బకాయిలు ఇలా ఏ అంశంపై కూడా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదంటున్నారు పబ్లిక్. దీంతో చాలా మంది లాటరీలో ప్లాట్ వచ్చినా ఇప్పుడు కొనడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ముందు డబ్బు కట్టి తర్వాత బ్యాంక్ లోన్ కు దరఖాస్తు అన్నందుకు..

ఇప్పుడు కొత్తగా బ్యాంక్ లోన్ గ్యారంటీ విషయంలోనూ హెచ్ఎండీఏ అధికారులు ఎన్ఓసీ (NOC) ఇవ్వకపోవడంతో చాలా రోజుల వరకు లబ్ధిదారులకు బ్యాంకు లోన్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. పెద్ద ఎత్తున లబ్ధిదారులు రాజీవ్ స్వగృహ ముందు నిరసనకు దిగడంతో అధికారులు దిగొచ్చి లబ్దిదారులకు ఎన్ఓసి ఇచ్చారు. అయితే హెచ్ఎండీఏ , బ్యాంక్ అగ్రిమెంట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ముందే డబ్బులు కట్టాలని...తరువాత బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో వెనకడుగు వేశారు.

లాటరీలో వచ్చిన ఇంటి కండిషన్ చూసి...

రాజీవ్ స్వగృహ అపార్ల్ మెంట్లు కట్టి 11 ఏళ్ల అవుతోంది. ఇప్పుడు వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు ఇళ్లు చూసుకునేందుకు వచ్చి... వాటి కండిషన్ చూసి కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కొత్తగా ప్లాట్లు కొనుక్కునే వారు అన్ని సౌకర్యాలపై క్లారిటీ తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అసోసియేషన్ వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం కట్టిన ఫ్లాట్లకు అందరికీ పూర్తి స్థాయిలో పార్కింగ్ సౌకర్యాలు లేవు. అందుకే ఓపెన్ పార్కింగ్ పేరిట ఫుట్ పాత్ స్థలాన్ని కూడా ప్రభుత్వం అమ్ముకుంటోందన్న విమర్శలున్నాయి.
అధికారులు మాత్రం ప్లాట్లు, ఇతర సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. అయితే తమ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన తర్వాతే ముందుకు ప్రొసీడ్ అవుతామని అంటున్నారు వేలంలో ప్లాట్స్ అలాట్ అయినవారు. మొత్తానికి 11 ఏళ్లు గడిచినా స్వగృహ ప్లాట్లకు పట్టిన గ్రహణం వీడడం లేదనే ప్రచారం జరుగుతోంది.