- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- ట్యాంక్‌బండ్ వద్ద ప్రజా సంఘాల నిరసన
- చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆర్.కృష్ణయ్య
ట్యాంక్ బండ్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డ మృతి ఘటనపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి 24 గంటల్లో రిమాండ్ చేయాలని డిమాండ్ చేశాయి. మంగళవారం ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో గణేశ్అనే రజక యువకుడిపై దాడి చేసి, అతని భార్య వేడుకున్నా వినకుండా పసిబిడ్డను కాలితో తన్ని మరణానికి కారణమయ్యారని ఆరోపించారు.
ఈ ఘటనలో పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ బొమ్మ రాజు కృష్ణమూర్తి, నాయకులు ఆశయ్య, నరసింహ, స్కైలాబ్ బాబు, జూపల్లి రాజశేఖర్, బాలరాజ్, మల్లు లక్ష్మి, అనగంటి వెంకటేశ్తదితరులు పాల్గొన్నారు.
రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్: నాగర్‌కర్నూల్ పసిపాప మృతి ఘటన బాధాకరమని, బాధిత కుటుంబానికి తక్షణమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఘటనపై నిష్పాక్షిక, వేగవంతమైన దర్యాప్తు జరిపి, అవసరమైతే సిట్ నియమించాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
