బ్యాక్ టు సిటీ.. హైదరాబాద్​కు పబ్లిక్​ రిటర్న్​

బ్యాక్ టు సిటీ..  హైదరాబాద్​కు పబ్లిక్​ రిటర్న్​

సొంతూర్లలో దసరా పండుగను సంబురంగా చేసుకొని జనం మళ్లీ హైదరాబాద్‌‌ బాట పట్టారు. కార్లు, బైకులు, ఇతర వెహికల్స్‌‌లో బయల్దేరిన వారికి.. పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన చెక్‌‌ పోస్టులతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్​ జామ్ ​అయింది. యాదాద్రి జిల్లా ఆలేరులో తనిఖీల కారణంగా 2 కిలోమీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోయాయి. గూడూరు టోల్ ప్లాజా వద్ద వందలాది వాహనాలు జామ్ అయ్యాయి.

 

యాదాద్రి, వెలుగు: సద్దుల బతుకమ్మ, దసరా పండుగల కోసం హైదరాబాద్​ నుంచి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి పట్నానికి రిటన్​​ అయ్యారు. కార్లు, టూవీలర్స్​ తదితర వేలాది వెహికల్స్​లో మంగళవారం హైదరాబాద్ బాట పట్టారు. అయితే, ఎన్నికల కోసం  స్టేట్​ లెవల్లో అంతర్రాష్ట్ర, అంతర్​ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ ​పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయింది. 

సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ తనిఖీలతో పండుగలకు కొన్ని రోజుల ముందు వరకు ఇబ్బందులు తలెత్తినా పబ్లిక్​ సర్దుకున్నారు. కానీ, పండుగకు ముందు, తర్వాతి రోజుల్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. రెగ్యులర్​ వెహికల్స్​కు తోడు పండుగ వెహికల్స్​ రోడ్డెక్కడంతో వరంగల్ -- హైదరాబాద్​, విజయవాడ -- హైదరాబాద్​ హైవేలు రద్దీగా మారాయి. దీంతో హైవేలపై ఏర్పాటు చేసిన చెక్ ​పోస్టుల వద్ద పబ్లిక్​కు చుక్కలు కన్పించాయి. 

యాదాద్రి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన చెక్ ​పోస్ట్​ వద్ద చేసిన తనిఖీల కారణంగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెహికల్స్​ నిలిచిపోయాయి. ప్రతి కారును చెక్​ చేసిన తర్వాతే పంపించడంతో పబ్లిక్​అసహనానికి గురయ్యారు.  ఒక్కో వెహికల్​ దాదాపు గంటపాటు చెక్​ పోస్ట్​ పరిధిలో నిలిచిపోవాల్సి వచ్చింది.