హసన్‌పర్తి, వెలుగు: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంక్షతో అమలుకాని హామీలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు, ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన మాట్లాడారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు, ఇప్పటివరకు లబ్ధి పొందని ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా విధానాలు ఉండాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి ప్రజాసంక్షేమాన్ని పక్కన పెడుతున్నారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఆహారం, నివాసం వంటి మౌలిక అవసరాలు కల్పించేలా బడ్జెట్ రూపొందించాలని సూచించారు.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మార్కెట్ ఆధారిత బడ్జెట్లు ప్రజాసంక్షేమానికి ప్రమాదకరంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, పొలిటికల్ సైన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్.సుకుమార్ పాల్గొన్నారు.
