జోగిపేట/ రేగోడ్, వెలుగు: ప్రజా సంక్షేమం, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆందోల్ మండలం మన్సాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు. లబ్ధిదారులు నీరుడి జ్యోతి, గొల్ల లావణ్య, వంగ సుజాత కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టగా, మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు మెదక్ జిల్లా రేగోడ్ మండలం గజవాడ గ్రామంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మాట్లాడుతూ... దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురుచూస్తున్న పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందు జోగిపేటలో నర్సింగ్ కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్లు ప్రతీక్ జైన్, ప్రతిమాసింగ్, అడిషనల్ కలెక్టర్ పాండు, డీఆర్డీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు పాల్గొన్నారు.
