ఇస్లామాబాద్: పుల్వామా అటాక్ మాస్టర్ మైండ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హమ్జా బుర్హాన్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని దుండగులు హమ్జా బుర్హాన్‌పై మెరుపు దాడి చేశారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హమ్జా అక్కడికక్కడే మృతి చెందాడు.
దాడి చేసిన వారి గుర్తింపు లేదా హత్య వెనుక గల ఉద్దేశ్యం గురించి అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పుల్వామా నివాసి అయిన హమ్జా బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న 2019 పుల్వామా దాడి సూత్రధారులలో హమ్జా కీలకమైన వ్యక్తి. 2022లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.
పుల్వామా దాడి
యావత్ భారత దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్. 2019, ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లెథిపోరా దగ్గర భారత భద్రతా దళాలపై అత్యంత ఘోరమైన ఆత్మాహుతి ఉగ్రవాద దాడి జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై 78 వాహనాలతో సుమారు 2,500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌ను పేలుడు పదార్థాలతో (RDX) ఉన్న ఒక కారుతో ఉగ్రవాది బలంగా ఢీకొట్టాడు.
ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.
►ALSO READ | విజయ్ మాట తప్పినవ్..! మంత్రుల ప్రమాణ స్వీకారంలో తమిళ గీతం చివరగా పాడటంపై డీఎంకే ఫైర్
