విజయ్ మాట తప్పినవ్..! మంత్రుల ప్రమాణ స్వీకారంలో తమిళ గీతం చివరగా పాడటంపై డీఎంకే ఫైర్

విజయ్ మాట తప్పినవ్..! మంత్రుల ప్రమాణ స్వీకారంలో తమిళ గీతం చివరగా పాడటంపై డీఎంకే ఫైర్

చెన్నై: తమిళనాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. ఈ కార్యక్రమంలో తమిళ జాతీయ గీతాన్ని చివరగా ఆలపించడంపై ప్రతిపక్ష డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గవర్నర్ చేతిలో సీఎం విజయ్ కీలు బొమ్మగా మారి.. తమిళనాడు ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాడంటూ మండిపడ్డాయి. ఏ అధికారిక కార్యక్రమంలోనైనా తమిళ జాతీయ గీతాన్ని ముందుగా ప్లే చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. 

అసలేం జరిగిందంటే..?

సీఎం విజయ్ గురువారం (మే 21) తన కేబినెట్‎ను విస్తరించారు. కొత్తగా 23 మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన మంత్రుల చేత చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర గీతమైన 'తమిళ్ తాయ్ వాళుత్తు'ను చివరిగా ఆలపించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. తమిళ గీతానికి ముందు వందేమాతరం, జనగనమణ ఆలపించడంతో ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో సాంప్రదాయకంగా తమిళ తాయ్ వాళుత్తును మొదట ఆలపిస్తున్నారని.. ఇప్పుడా సంప్రదాయాన్ని విస్మరిస్తూ తమిళ గీతాన్ని చివరగా పాడటం సరికాదని టీవీకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం విజయ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి తమిళనాడు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తు్న్నారని మండిపడుతున్నాయి. 

ALSO READ : బండి భగీరథ్ ను పోలీసులే అరెస్ట్ చేశారు

విజయ్‌పై డీకేఎం, వామపక్ష పార్టీలు విమర్శలు

ఈ వివాదంపై డీఎంకే అధికార ప్రతినిధి కనిమొళి ఎన్.వి.ఎన్. సోము స్పందించారు. ఈ పరిణామం తమిళ భాష, గుర్తింపు పట్ల అగౌరవాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. డీఎంకే అధికారంలో ఉన్నంత కాలం తమిళ భాషకు ఏదైనా అగౌరవం జరిగితే ఎప్పుడూ తలవంచలేదని గుర్తు చేశారు. గవర్నర్ చేతిలో టీవీకే ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. 

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ మాట్లాడుతూ.. తమిళ్ థాయ్ వాళ్తును చివరగా ఆలపించడం సంప్రదాయాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. 
ఈ తప్పుకు ఎవరు బాధ్యులో తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు గవర్నర్ రాష్ట్ర గీతానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తమిళ ప్రజల మనోభావాలను కూడా తగిన విధంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తమ పార్టీ భారత జాతీయ గీతానికి వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళ 'తాయ్ వాళుత్తు'కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తమ వైఖరిని స్పష్టం చేశారు.