పుణెలో ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లపై మోకాళ్లోతు నీళ్లు

పుణెలో ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లపై మోకాళ్లోతు నీళ్లు

మహారాష్ట్రలోని పూణెలో భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. ఆదివారం(ఆగస్టు 18, 2024) కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు భారీ ఎత్తున నీట మునిగాయి. రోడ్లు, వీధులు చెరువులను తలపించాయి.  రోడ్లపై మోకాళ్లోతు నీళ్లు రావడంతో  భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో పూణెలోని ప్రధాన వీధులు ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.. భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పడుతున్న దృశ్యాల వీడియోలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

వరదలు, నీళ్లు నిలిచిపోవడంతో నగరంలో చాలా ప్రాంతాలు నీటిలో మునిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణెలోని బీటీ కవాడే రోడ్ లో కార్లు, ఆటోలు నీటిలో మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు స్థానికులు. 

పూణెలో గంట వ్యవధిలోనే భారీ వర్షం కురిసింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై, వీధుల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఘోర్ పాడి, సోపాన్ బాగ్, బీటీ కవాడే,  రేర్ వాడలో భారీవర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. బైకులు, కార్లు, ఆటో రిక్షాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

కేవం గంటపాటు కురిసిన వర్షానికి పూణె వాసులకు తీవ్ర అంతరాయం కలిగిం చింది. చందన్ నగర్, ఖరాడీ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘోర్ పాడిలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా పూణె అంతటా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తారాదత్, శివదత్ కాలనీలను వరదలు ముంచెత్తాయి. ఈ కాలనీల్లో చాలా ఇళ్లలోకి నీరు చేరింది. 

ఇటీవల వర్షాల తర్వాత పదిరోజులు గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. శనివారం, ఆదివారం మళ్లీ విజృంభించాడు. ఆదివారం కురిసిన భారీ వర్షంతో పూణె వాసులను ఆందోళనకు గురి చేసింది. పనులు ముగించుకొని ఇళ్లకు చేరే సమయంలో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచి ప్రజల జీవనానికి  తీవ్ర అంతరాయం కలిగింది. 
 
రాబోయే రోజుల్లో పూణె సిటీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.