పాక్-చైనాతో జాగ్రత్త.. భారీ కుట్రకు పన్నాగం

పాక్-చైనాతో జాగ్రత్త.. భారీ కుట్రకు పన్నాగం

చండీగఢ్: రైతుల ఉద్యమం మొదలైనప్పటి నుంచే తమ రాష్ట్రానికి పాకిస్థాన్ ద్వారా ఆయుధాల రాక ఎక్కువైందని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అన్నారు. బార్డర్ స్టేట్ అయిన పంజాబ్‌‌కు పాక్ నుంచి ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు కేంద్రానికి చెప్పానని ఆయన తెలిపారు. పాక్‌‌-చైనా కలసి భారీ కుట్రకు పన్నాగం పన్నుతున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సర్కార్‌‌ను హెచ్చరించారు.

‘భారత్కు‌ రెండు సరిహద్దుల్లో పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉంది. వెస్టర్న్ బార్డర్‌‌లో పాక్, నార్త్‌‌లో చైనాతో ప్రమాదం ఉంది. రెండు దేశాలూ కలసి కుట్ర పన్నుతున్నాయి. కానీ ఈ బార్డర్‌‌లో భారత సైనికులు సమర్థంగా పహారా కాస్తున్నారు. పొరుగు దేశాల కుట్రలను మనం భగ్నం చేయాలి. మన సైనికుల ఆత్మస్థైర్యం తగ్గకుండా చూసుకోవడం మన బాధ్యత. రిపబ్లిక్ డే నాడు జరిగిన హింసకు ఎవరు కారకులనేది విచారణలో తేలుతుంది. దీనికి ఎవ్వరినీ తప్పు పట్టలేం. రైతుల ఉద్యమం మొదలైనప్పటి నుంచి పాక్ గుండా ఆయుధాలు, డబ్బులు, హెరాయిన్‌‌ వస్తున్నాయి. ఆ దేశానికి చెందిన దాదాపు 30 డ్రోన్లను మన సైనికులు పట్టుకున్నారు. కానీ మరో 20 నుంచి 30 డ్రోన్లు మన చేతికి చిక్కకుండా తప్పించుకున్నాయి’ అని అమరిందర్ సింగ్ చెప్పారు.

‘కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా. సరిహద్దుల్లో చొరబాట్లకు పాక్ యత్నిస్తోందని కేంద్రానికి పలుమార్లు చెప్పా. పాక్ స్లీపర్ సెల్స్‌‌ను కనిపెట్టడంపై మనం పని చేయాలి. రైతుల ఉద్యమంలో ఖలిస్థానీలు ఉన్నారని నేను చెప్పలేను. ఖలిస్థాన్, నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అనేవి కేవలం పేర్లు మాత్రమే. కొందరు వైవిధ్యమైన సిద్ధాంతాలతో ఉంటారు. కొందరు లెఫ్టిస్టుల ఐడియాలజీని కలిగి ఉంటారు. ముఖ్యంగా దక్షిణ పంజాబ్ ఎప్పుడూ వామపక్ష భావజాలాన్ని నమ్ముతుంది’ అని అమరిందర్ పేర్కొన్నారు.