PBKS vs LSG: ఐపీఎల్ 2026 (IPL 2026) లో లీగ్ దశ క్లైమాక్స్‌కు చేరిన వేళ ప్లేఆఫ్స్ (Playoffs) రేసు రసవత్తరంగా మారింది. ఖచ్చితంగా గెలవాల్సిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) పై పంజాబ్ కింగ్స్ (PBKS) 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో హోమ్ టీమ్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరోచిత సెంచరీతో చేజ్ చేశాడు.
షమీ 'గోల్డెన్ డక్' మ్యాజిక్:
197 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. లక్నో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను 'గోల్డెన్ డక్' (0) గా అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కూపర్ కొన్నోలీ వచ్చి రావడంతోనే భారీ షాట్స్ ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, 22 పరుగుల వద్ద షమీ వేసిన ఒక అద్భుతమైన బంతికి కానల్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పంజాబ్ ప్లేఆఫ్స్ కలలు ప్రమాదంలో పడినట్లు కనిపించింది.
ప్రభ్‌సిమ్రాన్– శ్రేయస్ మధ్య పార్ట్‌నర్‌షిప్:
ఈ క్లిష్ట దశలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కలిసి లక్నో బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. రెండు వైపుల నుంచి పవర్‌ఫుల్ షాట్లతో దండయాత్ర చేస్తూ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. అర్థ శతకాలు పూర్తి చేసుకున్న తర్వాత వీరిద్దరూ మరింత దూకుడు పెంచారు. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న 140 పరుగుల భారీ భాగస్వామ్యానికి ఎట్టకేలకు లక్నో బ్రేక్ వేసింది. పంజాబ్ స్కోరు 162 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను అవుట్ చేసి లక్నో సూపర్ జాయింట్స్ అర్జున్ టెండూల్కర్ బ్రేక్‌త్రూ ఇచ్చాడు.
సిక్స్‌తో శ్రేయస్ అయ్యర్ సెంచరీ గెలుపు:
ప్రభ్‌సిమ్రాన్ అవుట్ అయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు. ఆ ఓవర్లో 6, 0, 6, 2, 0, 6 లతో ఏకంగా 20 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ పూర్తిగా పంజాబ్ వైపు తిరిగింది. ఇక మ్యాచ్ క్లైమాక్స్‌లో మొహిస్సిన్ ఖాన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి అదిరిపోయే సిక్స్ కొట్టిన శ్రేయస్ అయ్యర్.. తన సెంచరీని (101) పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
రేపటి మ్యాచ్‌లపైనే పంజాబ్ ప్లేఆఫ్స్ ఫేట్:
ఈ మ్యాచ్‌లో లక్నోపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పంజాబ్ కింగ్స్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ.. ప్లేఆఫ్స్ బెర్త్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రేపు (ఆదివారం) జరగబోయే ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌ల ఫలితాలపైనే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంది. ఆయా మ్యాచ్‌ల్లో సమీకరణాలు అనుకూలిస్తేనే శ్రేయస్ సేన అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.
Back to the WINNING ways! 🌟
— IndianPremierLeague (@IPL) May 23, 2026
Been 7 matches since #PBKS last won a game
They end the losing streak with a 7️⃣-wicket win 👊
Scorecard ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/VzwWCcbx0J
