పిల్లి కళ్లు.. చక్కని నవ్వు.. పొడవాటి జుట్టు.. చూస్తే హీరోయిన్లా ఉంది అనిపిస్తుందేమో. కానీ, నటించాలంటే ఇవన్నీ ఉంటే సరిపోదు.. నటన కూడా వచ్చుండాలి అనే క్లారిటీ ఉంది ఈ అమ్మాయికి. చిన్నప్పుడు ఏవేవో అవ్వాలని కలలు కన్న ఆమె యాక్టర్ కావాలని మాత్రం అనుకోలేదట. కెరీర్ మొదలుపెట్టాక ‘నా వల్ల కాద’ని మధ్యలో వదిలేసిన ఆమె తిరిగి నటన మొదలుపెట్టాక ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాలో భాగమైంది. సాఫ్ట్‌గా కనిపిస్తున్న ఈ పంజాబీ బ్యూటీ ‘ది బెంగాల్ ఫైల్స్’లో పాత్రలో లీనమై ఉగ్రరూపం చూపించింది. నేనేంటి? నటనేంటి? అనుకున్న ఆమె ఇప్పుడు ‘నటనే నా లైఫ్’ అంటోంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
సిమ్రత్ కౌర్ రంధ్వా ముంబైలో ఉండే పంజాబీ సిక్కు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆమె 2017లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన సిమ్రత్ హిందీలోనూ నటిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ప్రేమతో మీ కార్తీక్. తర్వాత పరిచయం, డర్టీ హరి, బంగార్రాజు, మాయా పేటిక వంటి సినిమాల్లో నటించింది.
దీలో సోని, గదర్ 2, వన్వాస్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేటెస్ట్గా ఆమె నటించిన ‘ది బెంగాల్ ఫైల్స్’ త్వరలోనే స్ట్రీమింగ్కు రానుంది. సిమ్రత్ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు ఆమె మాటల్లోనే..
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు ఫ్యాషన్, మేకప్ గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. దాంతో స్పోర్ట్స్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకునేదాన్ని. నాకు ఏడేండ్లు ఉన్నప్పటినుంచి కరాటే నేర్చుకున్నా. ఎన్నో కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేశా. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించా. కానీ, ఆ ఆర్ట్ నా కెరీర్‌కు ఉపయోగపడదని అర్థమైంది. ఎందుకంటే కరాటే ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో లేదు. అందుకే ఏదైనా చదువుదాం అనుకున్నా. అప్పటివరకు స్టడీ మీద ఎలాంటి ఫోకస్ పెట్టలేదు. అప్పుడు వెళ్లి మా పేరెంట్స్‌ని అడిగా.. ‘ఏం చదవాలి?’ అని. వాళ్లు సైన్స్ అన్నారు. మా సిస్టర్ని అడిగితే.. ‘‘నువ్వు అనుకున్నది జరగదు కదా. కానీ, డబ్బులు అయితే సంపాదించాలి. కాబట్టి కంప్యూటర్ సైన్స్ తీసుకో’’ అంది. అలా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్‌లో చేరా.
ఓవర్ యాక్టింగ్ చేసి..
అక్కడ ఒక గోడ మీద స్టార్స్ ఫొటోలు ఉన్నాయి. రోజూ అవి చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఆ ఫొటోలు చూస్తుంటే.. నేను కూడా స్టార్ అయితే ఎంత బాగుండు అని ఊహించుకున్నా. కానీ, కంప్యూటర్ సైన్స్ చేస్తున్న నాకు అలాంటి ఆఫర్ ఎలా వస్తుంది? పైగా నాకు ఆ ఫీల్డ్కి సంబంధించిన స్కిల్ కూడా లేదు. నేనెలా స్టార్ అవుతా? అనుకునేదాన్ని. అయితే అనుకోకుండా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఒక అవకాశం వచ్చింది. ‘క్యాడ్బరీ’ చాకొలెట్ అడ్వర్టైజ్మెంట్లో నటించేందుకు ఫ్రెష్ ఫేస్ ఉండాలని కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు వాళ్లు. అలా నేను ఊహించని విధంగా చాన్స్ రావడంతో వెంటనే ఓకే చేశా.
ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను చేయనని చెప్పా. కానీ, వాళ్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను రిజెక్ట్ చేస్తూనే ఉన్నా. ఒకరోజు మా అమ్మ ఆ ఫోన్ తీసుకుని ‘మా అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది’ అని మాట ఇచ్చింది. నేను ‘అదేంటి అమ్మా నాకు యాక్టింగ్ రాదు కదా’ అలా ఎలా చెప్పావ్? అని అడిగా. అందుకు మా అమ్మ ‘పొడుగ్గా, అందంగా ఉంటావు. నీకు పొడవైన జుట్టు ఉంది. నువ్వెందుకు హీరోయిన్ కాకూడదు?’ అంది. ఆడిషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చా.
నాకు ఎలాగూ యాక్టింగ్ రాదు.. ఓవర్ యాక్టింగ్ చేస్తే వాళ్లే పంపేస్తారు. వెంటనే ముంబై వచ్చి నా పని నేను చేసుకోవచ్చు అనుకున్నా. కానీ, ఆ సినిమాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ కోసమే చూస్తున్నారట. దాంతో నన్ను ఆ మూవీలో రోల్‌కి సెలక్ట్ చేశారు. కేరళలో షూటింగ్ జరుగుతోంది. తెలుగులో డైలాగ్స్ చెప్పడం కంటే కంప్యూటర్ సైన్స్ చదవడం బెటర్ అనిపించింది.
కొవిడ్ వల్ల..
తెలుగులో మొదటి సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిలయ్యాయి. ఆ తర్వాత చాలా ప్రాజెక్ట్స్‌కి ఆడిషన్ ఇచ్చి రిజెక్ట్ అయ్యా. దాంతో 2019లో ఇండస్ట్రీ వదిలిపెట్టి.. ఆస్ట్రేలియా వెళ్లి చదువు కొనసాగించాలనుకున్నా. అప్పుడే కొవిడ్ వచ్చింది.. ముంబైలోనే ఉండి పోయా. కంటెంట్ క్రియేటర్ అవ్వడానికి నాలో అసలు ఏదైనా టాలెంట్ ఉందా? అని నెలకు ఒకసారి ఆలోచించుకునేదాన్ని. ఖాళీ టైంలో మోనోలాగ్స్ ప్రిపేర్ అయ్యి చెప్పేదాన్ని.
కానీ, ఆప్పుడు కెమెరా నా ముందు లేకపోవడం వల్ల ఆ ఫీలింగ్ చాలా మిస్ అయ్యా. ఒకరోజు రియలైజ్ అయ్యా.. నేను యాక్టింగ్ చేయాలని. మళ్లీ ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా.. ఎప్పటిలానే రిజెక్ట్ అయ్యా. అయినా నాలో ఆ తపన అలాగే ఉండాలి అనుకున్నా. ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఒక ఆడిషన్ తర్వాత సెలక్ట్ అయ్యానని ఫోన్ వచ్చింది. అయితే మొదట్లో అది ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పడంతో అయిష్టంగానే ఆడిషన్‌కు వెళ్లా. ఆడిషన్ అయిపోయాక ‘గదర్ 2’ సినిమాలోని లీడ్ రోల్స్‌లో ఒకటి నీ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ తర్వాత మరో12కు పైగా ఆడిషన్లు చేశారు. రెండు నెలల తర్వాత డైరెక్టర్ సెలక్ట్ అయ్యానని చెప్పారు.
అదే టైంకి బాలీవుడ్లో నేను చేసిన మొదటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. నేను ఆ డైరెక్టర్‌కి ఫోన్ చేసి ప్రమోషన్స్ ఎప్పటినుంచి మొదలవుతున్నాయని అడిగితే.. ‘సారీ.. మీ పాత్ర ఎడిటింగ్‌లో తీసేశాం’ అని చెప్పారు. అది వినగానే నాకు చాలా బాధేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఫెయిల్ అయింది. గదర్ సక్సెస్ నేను ఊహించలేదు. ఇప్పటికీ డ్రీమ్‌లానే అనిపిస్తుంది. అలాంటి సినిమాలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నా.
