న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు చేరుకున్నారు. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన గురువారం (డిసెంబర్ 4) రాత్రి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్ పోర్టులో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన పుతిన్ శుక్రవారం (డిసెంబర్ 5) జరగనున్న 23వ భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా భారత్-రష్యా మధ్య అణు విద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, వ్యవసాయం, రక్షణ, ఆర్థిక అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ దాదాపు నాలుగేళ్ల తర్వాత పుతిన్ భారత పర్యటనకు రావడంతో ఈ టూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా, ఉక్రెయిన్, ఇంగ్లాండ్, యూరప్ వంటి దేశాలను పుతిన్ ఇండియాను నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. రాజధానిలో సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసి భారీగా బలగాలను మోహరించారు. ఒకవైపు ఇండియా, మరోవైపు రష్యా సెక్యూరిటీ అధికారులు పుతిన్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
