ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ పుతిన్

ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ పుతిన్
  •      మొత్తం ఆస్తులు 16 లక్షల కోట్లకుపైనే అని ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిపోర్టు

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆస్తులు అధికారికంగా తక్కువే అయినప్పటికీ, రహస్యంగా ఆయనకున్న సంపద ప్రపంచంలో మరే పొలిటీషియన్​కు లేదని రిపోర్టులు సూచిస్తున్నాయి. పుతిన్​కు నెలవారీ జీతం రూ.9.7 లక్షలు, 800 స్క్వేర్ ఫీట్లున్న అపార్ట్​మెంట్, మూడు కార్లు మాత్రమే ఉన్నట్లు అఫీషియల్ లెక్క. కానీ, ఆయనకు సీక్రెట్​గా ఉన్న సంపదంతా కలిపితే రూ.16 లక్షల కోట్లకుపైగా ఉంటుందని ఫార్చ్యూన్ మ్యాగజైన్ సంచలన విషయాలు వెల్లడించింది. అధ్యక్షుడి హోదాలో చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు చెప్పుకుంటున్నా.. పుతిన్​కు అత్యంత విలాసవంతమైన బ్లాక్ సీ మాన్షన్ ఉందని మ్యాగజైన్ పేర్కొంది. 

దీనినే పుతిన్స్ కంట్రీ కాటేజ్​గా పిలుస్తారు. ఇందులో గ్రీకు దేవతల పాలరాత విగ్రహాలతో చెక్కిన స్విమ్మింగ్ పూల్, యాంఫీ థియేటర్, అత్యాధునికి ఐస్ హాకీ రింక్, కాసినో, నైట్ క్లబ్ ఉన్నాయి. ఈ భవనంలో రూ.4 కోట్లకు పైగా విలువ చేసే డైనింగ్ టేబుల్, రూ.50 లక్షల విలువ చేసే బార్ టేబుల్ ఉన్నాయట. టాయిలెట్ కడిగే బ్రష్, టాయిలెట్ పేపర్ హోల్డర్​కే రూ. లక్ష చొప్పున ఖర్చవుతుందంటే ఈ మాన్షన్ ఎంత లగ్జరీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

పైగా ఈ బిల్డింగ్​ను మెయింటేయిన్ చేసేందుకు పనిచేసే 40 మంది సిబ్బందికే ఏడాదికి రూ.16 కోట్ల వేతనం ఇస్తున్నారట. ఇవే కాకుండా పుతిన్​కు ఇంకో 19 ఇండ్లు, 700 కార్లు, 58 విమానాలు, హెలికాప్టర్లున్నాయని ఫార్చ్యూన్ పేర్కొంది. అంతెందుకు.. పుతిన్ పెట్టుకునే చేతి వాచీల ఖరీదే ఆయన తీసుకునే జీతానికి ఆరు రెట్లు ఎక్కువని తెలిపింది.