నేడు సీబీఐ ముందుకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

నేడు సీబీఐ ముందుకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
  • వామనరావు దంపతుల  హత్య కేసు దర్యాప్తు స్పీడప్

పెద్దపల్లి, వెలుగు:  న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును సీబీఐ సోమవారం విచారించనుంది. శనివారమే ఆయనకు నోటీసులిచ్చిన సీబీఐ.. రామగుండంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

నెల రోజులుగా సీబీఐ అధికారులు.. ఈ కేసుకు సంబంధించిన నిందితులతోపాటు పలువురు పోలీసు అధికారులను విచారించారు. ఈ క్రమంలోనే పుట్ట మధుకు నోటీసులు రావడంతో ఈ కేసును సీబీఐ విచారిస్తున్న తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ క్రమంలో సీబీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

విచారణ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులకు దారితీయవచ్చని అంచనా వేస్తున్నాయి. 2021 ఫిబ్రవరి 17న తన కొడుకు గట్టు  వామనరావు, కోడలు పీవీ నాగమణిల హత్య జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని ఆయన తండ్రి గట్టు కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్ తో సీబీఐ రంగంలోకి దిగింది. నెల రోజుల కింద మొదలైన సీబీఐ విచారణ చివరగా పుట్ట మధు వరకు వచ్చింది.