మేడిగడ్డను టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా మారుస్తాం : పుట్ట మధుకర్‌‌

మేడిగడ్డను టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా మారుస్తాం : పుట్ట మధుకర్‌‌

మహదేవపూర్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంథని నియోజకవర్గ బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ పుట్ట మధుకర్‌‌ హామీ ఇచ్చారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా శనివారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మధుకర్‌‌ మాట్లాడుతూ తనది, ప్రజలది ఓట్ల సంబంధం కాదని, పేగు బంధం అని చెప్పారు.

70 ఏండ్ల కాంగ్రెస్‌‌ పాలనలో జరగని అభివృద్ధిని తాను ఐదేళ్లలోనే చేసి చూపించానన్నారు. మేడిగడ్డ బ్యారేజీ రైతుల సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌‌బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కొన్ని చోట్ల ఇప్పటికే పోడు పట్టాలు ఇచ్చామని, మిగతా వారికి కూడా ఇస్తామని చెప్పారు. సూరారం, మహదేవపూర్‌‌, కాళేశ్వరం తదితర గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌‌ఎస్‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో పీఏసీఎస్‌‌ చైర్మన్‌‌ చల్లా తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షడు లింగంపల్లి శ్రీనివాస్, సర్పంచ్‌‌లు నాగుల లక్ష్మారెడ్డి, శ్రీపతి బాపు, ఎంపీటీసీ మమత పాల్గొన్నారు .