గూఢచర్యం ఆరోపణలు.. ఖతార్​లో 8 మంది భారత మాజీ ఆఫీసర్లకు మరణశిక్ష

గూఢచర్యం ఆరోపణలు.. ఖతార్​లో 8 మంది భారత మాజీ ఆఫీసర్లకు మరణశిక్ష

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ ఆఫీసర్లకు ఖతార్ లో ఉరి శిక్ష పడింది. ఈ మేరకు గురువారం ఖతార్​లోని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ఖతార్ కోర్టు తీర్పు  కాపీ కోసం చూస్తున్నామని, బాధితుల ఫ్యామిలీ మెంబర్స్, అడ్వకేట్స్ టీంతో చర్చించి చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని  తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాధ్యాతనిస్తామని, ఆఫీసర్లకు అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఖతార్ ప్రభుత్వం భారత నేవీకి చెందిన 8 మంది అధికారులతో పాటు ఖతార్ కు చెందిన మరో ఇద్దరిని 2022, ఆగస్టులో అరెస్ట్ చేసింది. 

వారు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్న టైంలో ఖతార్ సీక్రెట్​ ప్రోగ్రాం వివరాలను ఇజ్రాయెల్​కు అందించారని ఖతార్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.  ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు చెప్తున్నది. బాధితులు పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టు తిరస్కరించింది. తాజాగా వారికి ఉరిశిక్ష వేస్తూ  తీర్పు చెప్పింది. ఉరి శిక్ష పడిన వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సీడీఆర్ అమిత్ నాగ్‌పాల్, సీడీఆర్ పూర్ణేందు తివారీ, సీడీఆర్ సుగుణాకర్ పాకాల, సీడీఆర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో కొందరు గతంలో భారత యుద్ధనౌకలకు నాయకత్వం వహించారు.