అంధులకు దారిచూపే ఏఐ స్టిక్..అందుబాటులోకి తెచ్చిన క్వాడ్రిక్ ఐటీ

అంధులకు దారిచూపే ఏఐ స్టిక్..అందుబాటులోకి తెచ్చిన క్వాడ్రిక్ ఐటీ

హైదరాబాద్​, వెలుగు: చూపులేని వాళ్లకు రోజువారీ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్టిక్​ పట్టుకుని ఎటైనా వెళ్లినా.. ముందు ఏముందో తెలియని పరిస్థితి. ఏ ముప్పు ఉంటుందో అంచనా వేయడమూ కష్టమే. అలాంటి కష్టాలకు చెక్​ పెట్టేలా ఏఐ పవర్డ్​ స్టిక్​ను తీసుకొచ్చింది క్వాడ్రిక్​ఐటీ అనే సంస్థ. సెన్సర్ల ఆధారంగా పనిచేసే ఈ స్టిక్​.. దారిలో ఎలాంటి అవాంతరాలున్నాయో వెంటనే అలర్ట్​ చేస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితులనూ వెంటనే చెప్పేస్తుంది. వాయిస్​ కమాండ్స్​ ద్వారా ఈ స్టిక్​ను సులభంగా ఆపరేట్​ చేసేందుకు వీలుంటుంది. 

బ్లూటూత్​ కనెక్టెడ్​ ఇయర్​ పాడ్స్​తో నేరుగా స్టిక్​తోనే కనెక్ట్​ చేసుకునేందుకు వీలుంటుంది. స్టిక్​ వాడే యూజర్లకు.. వాయిస్​ కమాండ్స్​ను ఇచ్చేందుకు ఓ స్పీకర్​నూ అటాచ్​ చేస్తారు. ప్రస్తుతానికి దీని ప్రొటోటైప్​ను అభివృద్ధి చేసిన సంస్థ.. త్వరలోనే పూర్తి స్థాయిలో దానిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. 

ఫింగర్​ స్కాన్​ చేస్తే చాలు.. మన హెల్త్​ను చెప్పేస్తది!

ఫింగర్​ టిప్​లో ఒక బ్లడ్​ డ్రాప్​తో ఎన్నో రకాల టెస్టులను చేసే రోజులొచ్చేశాయి. అయితే, రక్తపు చుక్క అవసరం లేకుండా.. జస్ట్​ మన ఒంట్లోని రక్తాన్ని స్కాన్​ చేసి మనకున్న సింప్టమ్స్​ను చెప్పేసే యాప్​ ఒకటొచ్చింది. యాక్యులీ అనే సంస్థ.. లైఫాస్​ అనే యాప్​ను తీసుకొచ్చింది. దానికి కావాల్సిందల్లా ఓ స్మార్ట్​ఫోన్, ఈ లైఫాస్​ అనే యాప్​. యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకున్న తర్వాత.. ఫోన్​ బ్యాక్​ కెమెరాతో మన చూపుడు వేలిని స్కాన్ ​ చేస్తే.. ఫొటోక్రొమటోగ్రఫీ ద్వారా మన బ్లడ్​ను ఆ యాప్​ స్కాన్​ చేసి మనలోని సింప్టమ్స్​ను పసిగట్టేస్తుంది. 

హిమోగ్లోబిన్​ స్థాయులు, హార్ట్​రేట్,  గుండె ఆరోగ్యం, లివర్​ హెల్త్, మజిల్​ హెల్త్, ఊపిరితిత్తుల ఆరోగ్యం, మెంటల్​ హెల్త్​ ఎలా ఉందో పసిగడుతుంది. 93‌.8 శాతం కచ్చితత్వంతో ఈ యాప్​ పనిచేస్తుందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఇది ఫ్రీ కాదు. నెలలో ఓ రెండు మూడు టెస్టులు చేసుకోవాలంటే రూ.500 కట్టాల్సిందే.