- తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం డిమాండ్
- హాజరైన ఆర్ కృష్ణయ్య, జాజుల
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథిలో అర్హులైన కళాకారులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ఉద్యమ కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. ఆనాటి చైర్మన్ రసమయి బాలకిషన్ వారికి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించింది. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఉద్యమ కళాకారులు పోరు దీక్ష చేపట్టారు.
దీక్షకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మోహన్ బైరాగి, దరువు అంజన్న, బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడు జనగలం రామలింగం హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. అర్హులైన కవులు, కళాకారులను గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథిలోని వేయి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాజుల మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన కళాకారులను పట్టించుకోకపోతే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. జనగలం రామలింగం, మోహన్ బైరాగి, దరువు అంజన్న మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న అర్హులైన కళాకారులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు.
నిరుపేద కళాకారులకు 250 గజాల స్థలం, ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో కవులు, కళాకారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, 10 లక్షల ఆరోగ్య భద్రత, ఉచిత హెల్త్ కార్డ్స్ అందజేయాలని కోరారు. అన్నువోజు వెంకటేశం, డప్పు స్వామి, కిరణ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమ కళాకారులు పాల్గొన్నారు.
