
హైదరాబాద్, వెలుగు: ‘‘దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. కరెంటు కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా వినియోగించుకోవడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముంది. అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన కరెంటును సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ విధానం ఉండాలి’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. 3 రోజులపాటు రాష్ర్టంలోని పలు పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన రాజీవ్ శర్మ కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ, ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యను 6 నెలల్లోనే అధిగమించాం
రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దేందుకు పీఎఫ్‌సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు, రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించినందుకు రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ర్టం ఏర్పడినపుడు విద్యుత్ సమస్య అవరోధంగా మారింది. సమగ్ర వ్యూహంతో 6 నెలల్లోనే సమస్యను అధిగమించాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్ర ఆదాయం పెరిగింది” అని వివరించారు. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైందన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకుని, మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడంలో పీఎఫ్‌సీ సహకారం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ శర్మ దంపతులను కేసీఆర్ సన్మానించారు.
గర్వంగా ఉంది: పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్ శర్మ
తెలంగాణ అభివృద్ధిలో పీఎఫ్‌సీ భాగస్వామి కావడం గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్ శర్మ అన్నారు. తాము ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రికార్డు సమయంలోనే పవర్ ప్లాంట్లు, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తున్నారని కొనియాడారు. పవర్ ప్లాంట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. మూడున్నర ఏండ్ల క్రితం సీఎం కేసీఆర్.. స్ర్కీన్‌పైన చూపించిన కాళేశ్వరం ప్రాజెక్టును, ఇప్పుడు నేరుగా చూశానన్నారు. గోదావరి నీటి పంపింగ్ విధానం అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం.. మాటలు చెప్పినంత తేలిక కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటోందన్నారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారని అభినందించారు.
ప్రభాకర్ రావుకు ప్రశంసలు
రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్ కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కృషి ఉందని సీఎం కేసీఆర్, పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో పీఎల్ఎఫ్ పెరిగిందని, తనపై పెట్టిన బాధ్యతలను ప్రభాకర్ రావు పూర్తిగా నెరవేర్చారని కేసీఆర్ అన్నారు. ప్రభాకర్ రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్ శర్మ అన్నారు. విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని కొనియాడారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్ రావు చెప్పారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు.