
- శ్రీలంక నుంచి ధనుష్కోడి వరకు 33 కిలోమీటర్లు ఈత పోటీలు
ముషీరాబాద్,వెలుగు: స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీలంక – ధనుష్కోడి వరకు కొనసాగే రిలే స్విమ్మింగ్ పోటీలకు బర్కత్ పురాకు చెందిన గంధం క్వీని విక్టోరియా ఎంపికయ్యారు. మంగళవారం శ్రీలంకలోని తలైమినార్ వద్ద పోటీలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి రామేశ్వరానికి 12 కిలో మీటర్ల దూరంలోని ధనుష్కోడి వరకు పోటీ ఉంటుంది. భారత్ నుంచి ఆరుగురు ఎంపికవగా.. వీరిలో హైదరాబాద్ కు చెందిన క్వీని విక్టోరియా ఒకరు.
శ్రీలంక నుంచి ధనుష్కోడి వరకు 33 కిలోమీటర్లు బంగాళాఖాతంలో ఈదుతారు. తిరిగి ధనుష్కోడి నుంచి తలైమినార్ వరకు ఈదుకుంటూ వెళ్తారు. కోచ్ దినేష్ రజోరియా శిక్షణలో క్వీని విక్టోరియా రిలే స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైంది. సోమవారం ఆమె శ్రీలంక బయలుదేరి వెళ్తున్న సందర్భంగా మాట్లాడారు. రిలే స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని, సరికొత్త రికార్డు నెలకొల్పి దేశానికి కీర్తి ప్రతిష్టలను తెస్తామని క్వీని విక్టోరియా పేర్కొన్నారు.