అంగట్లో సరుకుల్లా క్వశ్చన్​ పేపర్లు అమ్మారు : షర్మిల

అంగట్లో సరుకుల్లా క్వశ్చన్​ పేపర్లు అమ్మారు : షర్మిల
  • టీఎస్​పీఎస్సీ రద్దు కోసం.. రాష్ట్రపతికి సిఫార్సు చేయండి
  • గవర్నర్ తమిళిసైకి షర్మిల లేఖ
  • నిరుద్యోగులకు న్యాయం చేయాలని వినతి

హైదరాబాద్, వెలుగు : పేపర్ లీకేజీ అంశం రాష్ట్రంలోని 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసిందని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అంగట్లో సరుకుల్లా క్వశ్చన్​ పేపర్లు అమ్మారని మండిపడ్డారు. ఆర్టికల్​ 317 ప్రకారం టీఎస్​పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతూ బుధవారం గవర్నర్ తమిళిసైకి షర్మిల లెటర్ రాశారు. ‘‘పేపర్ల లీకేజీ కేసు కేసీఆర్ ప్రభుత్వం పక్కదారిపట్టిస్తున్నది. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్​ జడ్జితో విచారణకు అంగీకరించడం లేదు. గవర్నర్​గా విచక్షణాధికారాలు ఉపయోగించి బోర్డు రద్దు చేసేలా చూడాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్​లో అవకతవకలు జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు వెనుకాడితే రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉంది”అంటూ గవర్నర్​కు రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. 

లీకుల వెనుక బోర్డు చైర్మన్, మెంబర్లు, ఉద్యోగులతో పాటు మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. సిట్ పనితీరు నమ్మేలా లేదని విమర్శించారు. ప్రవీణ్, రాజశేఖర్ మాత్రమే లీక్ చేశారంటూ కేసు మూసివేసే కుట్ర జరుగుతున్నదని లెటర్​లో చెప్పారు. అదేవిధంగా, షర్మిల గురువారం ఇంద్రవెల్లి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. బుధవారం లోటస్​పాండ్ లో వైఎస్ విజయమ్మ బర్త్​డే వేడుకలు నిర్వహించారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

ధర్నాకు అనుమతివ్వండి.. హైకోర్టులో పిటిషన్

పేపర్ లీకేజీ ఘటనపై ఇందిరా పార్కు వద్ద ‘‘అఖిలపక్ష నిరాహార దీక్ష’’కు అనుమతిచ్చేలా చూడాలని కోరుతూ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. 17న దీక్ష నిర్వహించాలని భావిస్తే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. టెన్త్, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీల కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. 11వ తేదీన దీక్ష కోసం అప్లికేషన్ పెట్టుకుంటే.. 15న అనుమతి నిరాకరిస్తూ హైదరాబాద్​ అడిషనల్​ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై గురువారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.