
చెన్నై: ఐపీఎల్18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత చెత్తగా ఆడి చివరి స్థానంలో నిలవడంపై ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో వ్యక్తిగతంగా తాను కూడా నిరాశపరిచానని అంగీకరించాడు. ఎన్నో ఏండ్లుగా సీఎస్కేతో కొనసాగుతూ జట్టు ఉన్నతిని చూసిన తాను ఇప్పుడిలా డీలా పడటం చూసి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నానని భావోద్వేగానికి గురయ్యాడు.
ఈ సీజన్‌లో అశ్విన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి, 33 రన్స్ మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ లైవ్ సెషన్‌లో సీఎస్కే జట్టు నుంచి వెళ్లిపోవాలని ఓ అభిమాని చేసిన కామెంట్‌పై అశ్విన్ స్పందించాడు. ఈ ఏడాది తన ఇబ్బందులను అంగీకరించిన అశ్విన్ అభిమాని సందేశం వెనుక ఉన్న భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు. జట్టుకు మంచి జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని, వచ్చే సీజన్‌లో మరింత బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తానని తెలిపాడు.
‘సదరు అభిమాని సందేశం వెనుక ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకున్నాను. నేను కూడా జట్టు గురించి లోతుగా ఆలోచిస్తున్నా. ఈ సీజన్‌లో చేసిన పోరాటాన్ని వృథా కానివ్వను. నేను చాలా కష్టపడ్డాను. ఇంకా ఎక్కడ మెరుగుపడాలో నాకు తెలుసు. ముఖ్యంగా పవర్‌ప్లేలో చాలా రన్స్ ఇచ్చాను. దీనిపై దృష్టిసారించి వచ్చే సీజన్‌లో నా బౌలింగ్‌కు మరిన్ని ఆప్షన్స్ జోడించడానికి కృషి చేస్తాను. నాకు బాల్ ఇస్తే బౌలింగ్ చేస్తాను.. బ్యాటింగ్ చేయమంటే అదే చేస్తా. జట్టు కోసం నా వంతు కృషి చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని పేర్కొన్నాడు.
సీఎస్కేతో తన అనుబంధం చాలా బలమైనదని అశ్విన్ తెలిపాడు. అయితే, ఐపీఎల్ ప్లేయర్‌గా తాను ఇంతగా ఎప్పుడూ నిరాశ చెందలేదని అన్నాడు. ‘నేను 2009 నుంచి సీఎస్కేలో ఉన్నా. ఏడేండ్లు జట్టుకు ఆడాను. ఈ జట్టుతో కలిసి ఎన్నో ఉన్నత స్థాయిలను చూశాను. కానీ, ఇలాంటి దుఃఖాన్ని అనుభవించడం ఇదే తొలిసారి. అందుకే నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాను. ఈ జట్టు గురించి ఎవ్వరూ ఊహించలేనంత ఆసక్తి నాకు ఉంది. ఇప్పుడు నా దృష్టంతా తర్వాతి సీజన్‌లో నేను ఏమి చేయగలను అనే దానిపైనే ఉంది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.