గురుకుల పోస్టులు బ్యాక్ లాగ్ పెట్టొద్దు : ఆర్. కృష్ణయ్య

గురుకుల పోస్టులు బ్యాక్ లాగ్ పెట్టొద్దు :  ఆర్. కృష్ణయ్య
  • ఆప్షన్ పద్ధతిలో  భర్తీ చేయాలి
  • విద్యార్థులు నిరుద్యోగుల ర్యాలీలో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య 

ముషీరాబాద్,వెలుగు: గురుకుల పాఠశాల టీచర్ పోస్టుల భర్తీలో ఆప్షన్ పద్ధతిని పాటించి విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొందరు అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్​ఆధ్వర్యంలో శుక్రవారం టీచర్ పోస్టులు భర్తీలో ఆప్షన్ పద్ధతి పాటించాలని కోరుతూ యూనివర్సిటీ విద్యార్థులు విద్యానగర్ లో ఆర్. కృష్ణయ్యతో కలిసి భారీ ర్యాలీ తీశారు.  

ఈ సందర్భంగా బ్యాక్ లాగ్  పోస్టులు మిగల్చ వద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిలింక్విష్ పద్ధతి ప్రవేశపెట్టి ఆప్షన్ పద్ధతి ద్వారా మిగతా పోస్టులు మెరిట్ లో ఉన్నవారితో నింపాలని డిమాండ్ చేశారు. గురుకుల అభ్యర్థులు అన్ని పోస్టులకు పరీక్షలు రాశారని చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అవుతున్నారని తెలిపారు. సెలెక్ట్ అయిన అతను పైస్థాయి జాబ్ సెలెక్ట్ చేసుకోవడంతో  బ్యాక్ లాగ్  ఏర్పడుతున్నాయని, దీనితో పోస్టులు మిగిలిపోయి పాఠశాలల్లో చదువు చెప్పేవారు ఉండడం లేదన్నారు.

గత ప్రభుత్వం రద్దు చేసిన రి లింక్విష్ మెంట్  పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొంతమంది అధికారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  ర్యాలీలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, పగడాల సుధాకర్, నందగోపాల్, కొండపల్లి శీను, అస్మా, ఉపేందర్, బాలరాజ్, సుజాత, లావణ్య, అలేఖ్య, దీపిక తదితరులు పాల్గొన్నారు.