మెగా డీఎస్సీ ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు

మెగా డీఎస్సీ ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు
  • నిరుద్యోగుల మహా ధర్నాలో ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఆపబోమని హెచ్చరించారు. సోమవారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశ్, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. వర్షాన్ని లెక్కచేయకుండా  భారీగా తరలివచ్చిన యువత.. మెగా డీఎస్సీని ప్రకటించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. 

ఇందులో ఆర్.కృష్ణయ్య పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిటీ తేల్చిందని గుర్తుచేశారు. కానీ 5 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. 25 వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించేదాకా ఉద్యమం ఆపమని స్పష్టం చేశారు. టీచర్లు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.