కుల గణన వెంటనే చేపట్టాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

కుల గణన వెంటనే చేపట్టాలి: ఎంపీ  ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కుల గణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. శనివారం హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీసీలకు 20 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి  పెంచాలని తెలిపారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పక్క రాష్ట్రాలైన ఏపీ, ఒరిస్సా, మహారాష్ట్రలలో బీసీల కుల గణన చేస్తున్నారని చెప్పారు. 

కుల గణన చేపట్టడం వల్ల బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందని విమర్శించారు. పదేళ్లుగా అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసి లక్షల కోట్ల బకాయిలు మిగిల్చిందని మండిపడ్డారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజలు వారిని గద్దె దించారని కృష్ణయ్య వెల్లడించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్, కోట్ల శ్రీనివాస్, సుధాకర్, మధుసూదన్ పాల్గొన్నారు.