చదువు కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించింది : ఆర్.కృష్ణయ్య

చదువు కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించింది :  ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో చదువు కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే విద్యా వ్యవస్థను తొక్కి పెడుతున్నదని మండిపడ్డారు.  బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో విద్యార్థుల సమస్యలపై బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కృష్ణయ్య హాజరై, మాట్లాడారు. కాలేజీ స్టూడెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. 

దీనివల్ల విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు చేసుకోలేక విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని వెల్లడించారు. వెంటనే రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇస్తు్న్న ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ కు ఇవ్వడం లేదని విమర్శించారు.

  విద్యావ్యవస్థపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేసి చైర్మన్ నీలా వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యా ఉద్యోగ రంగంలో యువత చాలా ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ముందు తరాలు ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, బర్క కృష్ణ యాదవ్, రాజ్ కుమార్, నందగోపాల్ తదితరులు  పాల్గొన్నారు.