బీసీల రిజర్వేషన్లను 42% శాతానికి పెంచాలి.. మంత్రి సీతక్కకు ఆర్.కృష్ణయ్య వినతి

బీసీల రిజర్వేషన్లను 42% శాతానికి పెంచాలి.. మంత్రి సీతక్కకు ఆర్.కృష్ణయ్య వినతి

ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని  కోరారు. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియట్​లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన చేయకుండా, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. 

ఎన్నికలకు తొందర ఏముందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోరారు. బీసీల విద్య,  ఉద్యోగాల రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలని, క్రిమిలేయర్ ను తొలగించాలని డిమాండ్​చేశారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ తోపాటు 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క స్పందిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోలో అంశాన్ని అమలు చేస్తామని చెప్పారని కృష్ణయ్య తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, బాలస్వామి, వెంకటేశ్, శివకుమార్ ఉన్నారు.