హిమాన్షును చూసి కేసీఆర్, కేటీఆర్ నేర్చుకోవాలి.. 45 రోజులే డెడ్ లైన్..లేదంటే..

హిమాన్షును చూసి కేసీఆర్, కేటీఆర్ నేర్చుకోవాలి.. 45 రోజులే డెడ్ లైన్..లేదంటే..

తెలంగాణ ప్రభుత్వంపై నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో లక్డికాపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగులకు మద్దతుగా రాజ్య సభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆందోళనకు దిగారు. రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. 

భర్తీ చేయాలి లేదంటే..

రాష్ట్రంలో వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 45 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ను  విడుదల చేసి పోస్టులను భర్తీ చేయాలని...లేనిపక్షంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను , మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడం కారణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.   పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను  నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీచర్ల ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని చెప్పారు. టీచర్లు లేరనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం లేదన్నారు. పిల్లలు రావడం లేదనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు. 

హిమాన్షును చూసి నేర్చుకోండి..

హిమాన్షును చూసి తాత కేసీఆర్ , తండ్రి కేటీఆర్ నేర్చుకోవాలని ఆర్ కృష్ణయ్య సూచించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి మనవడు హిమాన్షు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.  కనీసం అతన్ని చూసైనా కేసీఆర్, కేటీఆర్ లు నేర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో అలాంటి దుస్థితిలో చాలా పాఠశాలలు ఉన్నాయని..వాటన్నింటిని ప్రభుత్వం బాగు చేయాలని డిమాండ్ చేశారు.