
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల నోటికాడ ముద్దను లాగేశారని.. ఇక, బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్పందన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.
అవసరమనుకుంటే బంద్ కు వెనకాడబోమని హెచ్చరించారు. గురువారం హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత 14 బీసీ సంఘాలు హైకోర్టు వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. నాలుగు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తూ కోర్టు స్టే ఇవ్వడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా.. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. రాజ్యాంగ విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకపక్క నామినేషన్లు దాఖలు చేస్తుంటే మరోపక్క మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామన్నారు.
బీసీలంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడం కరెక్టేనా? ఆయన అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నాలుగు రోజులుగా ట్రయల్ నడుస్తున్నప్పుడు మొదటి రోజే కాకుండా అనేక వాదనలు విన్నాక స్టే ఇవ్వడం బాధాకరమన్నారు. రిజర్వేషన్ల కేసులో 30 బీసీ సంఘాలు ఇంప్లీడ్కేసులు వేశారని పిటిషనర్ల వాదన కూడా వినకుండా స్టే ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
బీసీలను అవమానించారని.. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని, ఇలాంటి సమయంలోనే అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు రావడం జడ్జీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.