కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : ఆర్. కృష్ణయ్య

కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : ఆర్. కృష్ణయ్య
  • కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగం ప్రకారం.. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం వాటా కల్పించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్‌తో పాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, వెంటనే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి బీసీల సమస్యలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని, అప్పుడే దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి నెలకొంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువుకునేందుకు జాతీయ స్థాయిలో హాస్టల్స్, గురుకులాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 

బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం చేపట్టాలని, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించే సమయం ఆసన్నమైందని చెప్పారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాను లేవనెత్తిన అంశాలకు రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని  ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన బృందంలో అర్జున్ సింగ్, గగన్ లింగం, సందీప్ తదితరులు ఉన్నారు.