- రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీల 42శాతం రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో మాట్లాడుతానని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బీసీల పక్షపాత పార్టీ అని, ఇప్పటివరకు ముగ్గురు బీసీలను ప్రధానిగా చేసిందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో చేపట్టబోతున్న దేశవ్యాప్త కుల గణనతో, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుందని వెల్లడించారు. ప్రధాని మోదీతో జనవరి నెలలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఐదు లక్షల మంది బీసీలతో భారీ బహిరంగ సభ నిర్వహించి , బీసీల హక్కులను సాధించుకుంటామని వివరించారు. బీసీల సమస్యలపై డిసెంబర్ 10న ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, తెలంగాణ బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రాందేవ్, అనురాధ గౌడ్, రాజేందర్, లింగయ్య యాదవ్, భీమ రాజు, పద్మ, శివ యాదవ్, రాజు గౌడ్, నిఖిల్, సుప్రజ, గణేశ్, భవాని తదితరులు పాల్గొన్నారు.
