బీసీ సీట్లు తగ్గిస్తవా కేసీఆర్.. ఎన్నికల్లో గుణపాఠం చెబుతం: ఆర్ కృష్ణయ్య

బీసీ సీట్లు తగ్గిస్తవా కేసీఆర్.. ఎన్నికల్లో గుణపాఠం చెబుతం: ఆర్ కృష్ణయ్య

బీసీలకు అన్యాయం చేసిన  కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో  గుణపాఠం చెబుతామని హెచ్చరించారు బీసీ ఉద్యమ నాయకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. సీట్ల కేటాయింపుల్లో కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు.  బీసీలను ఎందుకు తొక్కేయాలని చూస్తున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు.  సీట్ల కేటాయింపులో  తప్పు సరిదిద్దుకుని రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.  కేసీఆర్ ను సీఎం చేసిందే బీసీలని..బీసీలంటే బిచ్చగాళ్లు కాదు.. వాటాదారులన్నారు కృష్ణయ్య.

50 శాతం సీట్లు కేటాయించాలని గత నెల రోజులుగా బీసీ సంఘాలు  డిమాండ్ చేస్తున్నా బీఆర్ఎస్ ఇంచు కూడా కదల్లేదని.. బీసీ ఓటర్లు కూడా ఇంచు కదలరని హెచ్చరించారు ఆర్. కృష్ణయ్య. బీసీలకు అన్యాయం చేసిన   బీఆర్ఎస్ నేతలను   బట్టలూడగొట్టి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు . తెలంగాణ ఉద్యమం ఎంత ఉదృతంగా జరిగిందో ఈ సారి బీసీలంతా అంతే ఆవేశంతో    పోరాడాలన్నారు.

 బీఆర్ఎస్ వ్యతిరేక చర్యలన్నింటిని రెండు కోట్ల కరపత్రాలతో ఊర్లలో పంపిణీ చేస్తే పార్టీ ఎమ్మెల్యేలను ఊర్లలోకి కూడా రానివ్వరన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలకు సీట్లు తగ్గించి కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.    బీసీ సీట్లను తగ్గించిన బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు..