
ఆర్.నారాయణమూర్తి, తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడే కాదు దర్శకుడు కూడా.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై తన సినిమాల ద్వారా పోరాడే ఆయన, తాజాగా 'యూనివర్సిటీ పేపర్ లీక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సరైన థియేటర్లు లభించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
థియేటర్ల కేటాయింపులో అన్యాయం..
ముఖ్యంగా, ఆగస్టు 22న విడుదలవుతున్న ఈ చిన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కరువయ్యాయి. హైదరాబాద్‌లో ఒకే ఒక్క థియేటర్ కేటాయించడం, అది కూడా కేవలం రెండు షోలకు మాత్రమే పరిమితం చేయడం ప్రేక్షకులను, సినీ ప్రియులను నిరాశకు గురిచేస్తోంది. అంతే కాదు వైజాగ్ లోనూ ఇదే పరిస్థితి. ఆన్ లైన్ ప్లాట్ పామ్స్ బుక్ మై షో వంటి వాటిల్లో టికెట్లు బుక్ చేసుకుందామన్నా తమ ప్రాంతంలో ఉన్న థియేటర్లలో విడుదల కావడం లేదని ఆర్. నారాయణ మూర్తి అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
సినీ ప్రముఖుల ప్రశంసలు... కానీ సహకారం కరువు
ఇటీవల 'యూనివర్సిటీ పేపర్ లీక్' సినిమా ప్రమోషన్ సందర్భంగా నారాయణమూర్తిని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన సమాజానికి ఎంతో ఉపయోగపడే చిత్రాలు తీస్తారని, ఆయనో 'సమాజం బరువు మోసే శక్తి' అని కొనియాడారు. 40 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రలోభాలు ఎదురైనా వాటికి లొంగకుండా తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని మెచ్చుకున్నారు. అలాంటి నిబద్ధత గల వ్యక్తికి, సమాజానికి మేలు చేసే సినిమాకు సరైన మద్దతు లభించడం లేదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణమూర్తి సినిమాలు సమాజానికి ఎంతో అవసరం. ఆయన ప్రతి సినిమా ఒక సందేశాన్ని ఇస్తుంది సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయన సినిమాలు ఎల్లప్పుడూ నిజమైన కథలను చూపిస్తాయి. ఆయన సినిమాలు థియేటర్లకు వెళ్లాలి" అని కోరారు. నారాయణమూర్తి గారు ఒక రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ధైర్యంగా చూపిస్తారు. ఆయనకు మనం మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు.
ప్రేక్షకుల ఆవేదన
ఇంతమంది ప్రముఖులు ప్రశంసించినప్పటికీ, 'యూనివర్సిటీ పేపర్ లీక్' సినిమాకు థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు, మాస్ మసాలా చిత్రాలు రాజ్యమేలుతున్నాయి. కానీ సామాజిక సందేశం ఉన్న సినిమాలు అరుదుగా వస్తున్నాయని, వాటిని కూడా మొగ్గలోనే తుంచేలా థియేటర్లు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలి, వాటికి మేము అండగా ఉంటాం అంటూ ఊదరగొట్టే సినీ పెద్దలకు ఆర్. నారాయణ మూర్తి సినిమా విషయంలో కన్పించడం లేదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
నారాయణమూర్తి లాంటి వ్యక్తులు వ్యక్తిగత లాభాల కోసం కాకుండా సమాజం కోసం సినిమాలు తీస్తున్నప్పుడు, వారికి సినీ పరిశ్రమ నుండి ప్రోత్సాహం అవసరం ఎంతైనా ఉంది. 'యూనివర్సిటీ పేపర్ లీక్' విషయంలో జరిగిన ఈ అన్యాయం, భవిష్యత్తులో మంచి సినిమాలు తీసేవారికి నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. మరి ఈ పరిస్థితిపై సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.