భారత్ గర్వించే ఘనత.. నార్వే చెస్ 2026 ఛాంపియన్‌గా ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా అరుదైన ఘనత

భారత్ గర్వించే ఘనత.. నార్వే చెస్ 2026 ఛాంపియన్‌గా ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా అరుదైన ఘనత

ఓస్లో: నార్వే చెస్ టోర్నీ 2026లో సంచలనం నమోదైంది. 20 ఏళ్ల భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ 2026 టైటిల్ విజేతగా నిలిచాడు. శుక్రవారం (జూన్ 5) జరిగిన ఫైనల్‎లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై అద్భుతమైన విజయం సాధించి కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా నార్వే చెస్ టైటిల్ గెల్చిన తొలి భారతీయుడిగా నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్. ప్రజ్ఞానందకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్, అలీరెజా ఫిరౌజ్జా, వెస్లీ సో, కీమర్ వంటి దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నీలో 20 ఏళ్ల ప్రజ్ఞానంద పోరాటం అద్భుతం. టోర్నీ మొదట్లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన ప్రజ్ఞా ధైర్యం కోల్పోకుండా తిరిగి బలంగా పుంజుకున్నాడు. క్లార్‎సన్ వంటి అగ్రశేణి ఆటగాడిని ఒకే టోర్నీలో రెండు సార్లు ఓడించి సంచలనం సృష్టించాడు. 

ఇక, లీగ్ చివరి దశలో కార్ల్‌సెన్, డి. గుకేష్, అలీరెజా ఫిరౌజ్జా, వెస్లీ సో, కీమర్ వంటి దిగ్గజాలపై వరుస విజయాలు నమోదు చేసి నార్వే చెస్ టోర్నీ 2026 విజేతగా అవతరించాడు. ఈ విజయం భారత చెస్ రంగంలో ప్రజ్ఞానంద ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించింది.